ఆసక్తి రేకెత్తించిన కేంద్ర మంత్రి ట్వీట్‌

దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ అధికమవుతున్నాయి. మరోవైపు కొవిడ్‌ బాధితులకు చికిత్స అందించేందుకు ఆస్పత్రులు కరవవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర రోడ్డు, రవాణాశాఖ మంత్రి వీకే సింగ్‌ చేసిన ట్వీట్‌ ఆసక్తి రేకెత్తించింది.

Updated : 19 Apr 2021 14:29 IST

 

దిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ అధికమవుతున్నాయి. మరోవైపు కొవిడ్‌ బాధితులకు చికిత్స అందించేందుకు ఆస్పత్రులు కరవవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర రోడ్డు, రవాణాశాఖ మంత్రి వీకే సింగ్‌ చేసిన ట్వీట్‌ ఆసక్తి రేకెత్తించింది. తన నియోజకవర్గ పరిధి ఘజియాబాద్‌లో కరోనా సోకిన ఓ వ్యక్తి గురించి ప్రస్తావిస్తూ ‘‘ నా సోదరుడికి కరోనా సోకింది. ఆస్పత్రిలో ఓ పడకను ఏర్పాటు చేయాలని ఘజియాబాద్‌ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా’’ అంటూ ట్వీట్‌ చేశారు.  దీనికి ఘజియాబాద్‌ జిల్లా మెజిస్ట్రేట్‌ను ట్యాగ్‌ చేశారు. దీంతో ఆ ట్వీట్‌ వైరల్‌గా మారింది.

ఈ ట్వీట్‌పై శివసేన నాయకురాలు, ఎంపీ ప్రియాంక చతుర్వేది స్పందించారు. ఆసుపత్రిలో ఓ పడక కోసం కేంద్ర మంత్రి ఇలా విజ్ఞప్తి చేయడం ఆయన నిస్సహాయతను తెలియజేస్తోందని ఆమె ట్వీట్‌ చేశారు. కరోనా సోకిన ఆ వ్యక్తికి సాయం అందాలని, అతడు క్షేమంగా ఉండాలని ఆశిస్తున్నట్లు ఆమె తెలిపారు. 

ట్వీట్‌ వైరల్‌ కావడంతో కొద్దిసేపటి తర్వాత వీకే సింగ్‌ స్పందించారు. ఆయన తనకు సోదరుడేమీ కాదని, తన నియోజకవర్గ పరిధిలోని ఓ వ్యక్తి అని వివరణ ఇస్తూ మరో ట్వీట్‌ చేశారు. తాను స్వయంగా ట్వీట్‌ చేస్తే అధికారులు వేగంగా స్పందిస్తారని, తద్వారా ఆయనకు వైద్యసాయం అందుతుందనే ఉద్దేశంతో మానవతాదృక్పథంతోనే అలా చేసినట్లు తెలిపారు. అనంతరం ముందుచేసిన ట్వీట్‌ను తొలగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని