Viral Story: మా అమ్మ నన్ను ఎందుకు వదిలించుకుంది?

గత పదకొండేళ్లుగా బీనా తన కన్నతల్లి కోసం వెతుకుతున్నారు. ఆమె కన్నీటి కథ ఆవేదనకు గురిచేస్తోంది.  

Updated : 13 Oct 2022 15:21 IST

ముంబయి: తల్లిదండ్రులకు దూరమై.. దత్తతకు వెళ్లిన పిల్లల జీవితాల్లో కన్నీటి తెర కదలాడుతూనే ఉంటుంది. దత్తత వెళ్లిన కుటుంబంలో బాగానే ఉన్నా.. కన్నవారు  తమను ఎందుకు వదులుకున్నారో తెలుసుకోవాలని ఆరాటపడతారు. కనీసం ఒక్కసారైనా వారిని కలుసుకోవాలనుకుంటారు. ఇదంతా వింటుంటే మణిరత్నం తీసిన ‘అమృత’ సినిమా కళ్లముందు కదలాడుతోంది కదా..! సరిగ్గా ఇలాంటి కథే బీనా మఖిజానీ ముల్లర్‌ది. ఆమె కన్నతల్లిని కలుసుకోవాలని పదకొండేళ్లుగా చేయని ప్రయత్నం లేదు.

బీనా ముఖిజానీ ముల్లర్‌ను 1978లో స్విట్జర్లాండ్‌కు చెందిన కుటుంబం దత్తత తీసుకుంది. ప్రస్తుతం ఆమెకు (44) సంవత్సరాలు. దక్షిణ ముంబయిలోని ఆశా సదన్‌ కేంద్రం నుంచి ఆమె దత్తతకు వెళ్లింది. ఆ సమయంలో రికార్డుల్లో బీనా తల్లి పేరు రొబెల్లో అని మాత్రమే ఉంది. ఇప్పుడు తన తల్లిని వెతుక్కోవడానికి బీనాకి ఉన్న ఏకైక క్లూ అది మాత్రమే. ‘రొబెల్లో అనే మహిళ 1978లో ముంబయిలో నాకు జన్మనిచ్చింది. ఆమెది గోవా కావొచ్చు. ఆమె గురించి తెలిసినవారు నన్ను సంప్రదించండి. మీ వివరాల్ని మేం గోప్యంగా ఉంచుతాం. నా జీవితంలో ఇదొక బాధాకర అనుభవం. నేను ఎవరి జీవితాన్ని నాశనం చేయాలనుకోవడం లేదు. నా ప్రశ్నలకు సమాధానాలు మాత్రమే వెతుకుతున్నాను’ అంటూ ఆమె ఉద్వేగానికి గురయ్యారు.

‘2011 నుంచి నా తల్లి కోసం వెతుకుతూనే ఉన్నాను. నాటి నుంచి ముంబయి వస్తూనే ఉన్నాను. కానీ, నా ప్రయత్నం కొంచెం కూడా ఫలించలేదు. ఏదో ఒకరోజు నాకు కావాల్సిన సమాధానాలు కనుక్కుంటాను’ అని వెల్లడించారు. తాజాగా మరోసారి తనను దత్తత ఇచ్చిన ఆనాథాశ్రమానికి వెళ్లారు. అక్కడ ఎలాంటి సమాచారం లభించకపోవడంతో నిరాశగా వెనుదిరగాల్సి వచ్చింది. ఈ వెతుకులాటలో  డైరెక్టర్‌ ఆఫ్ అడాప్టీ రైట్స్‌ కౌన్సిల్‌ అడ్వకేట్‌ అంజలి పవార్‌ ఆమెకు సహకరిస్తున్నారు. ‘తమ వద్ద ఎలాంటి పత్రాలు లేవని అనాథాశ్రమం సిబ్బంది వెల్లడించారు. బీనా ఆవేదన వారికి అర్థమవుతోంది. వారి వద్ద ఎలాంటి పత్రాలు లేకపోవడంతో సాయం చేయలేకపోతున్నారు’ అని పవార్ తెలిపారు. పేరు మాత్రమే తెలిసి ఉండడంతో జాడ తెలుసుకోవడం క్లిష్టంగా మారిందన్నారు. 

బీనా తన కన్నతల్లి ఎవరో తెలుసుకోవాలని మాత్రమే అనుకోవడం లేదు. అసలు తనను ఎందుకు వదిలించుకున్నారో కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు. ఇక ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. బీనాతో పాటు ముంబయికి వచ్చినవారు.. తమ తల్లికి అండగా నిలుస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని