Wuhan: 2015లో వుహాన్‌ నుంచి అమెరికాకు..!

కరోనావైరస్‌ వ్యాపించిన ఏడాది తర్వాత మెల్లగా ‘గెయిన్‌ ఆఫ్‌ ఫంక్షన్స్‌’ ప్రయోగాల వివరాలు బయటకు వస్తున్నాయి. వుహాన్‌ ల్యాబ్‌లోని ఓ కీలక శాస్త్రవేత్త వైరస్‌కు సంబంధించిన కీలక భాగాన్ని అమెరికా శాస్త్రవేత్తలకు ఇచ్చి ఈ ప్రయోగాల్లో పాల్గొన్నారు.

Updated : 01 Jun 2021 15:28 IST

 స్పైక్‌ ప్రొటీన్‌ తెచ్చిన బ్యాట్‌వుమెన్‌..

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

కరోనావైరస్‌ వ్యాపించిన ఏడాది తర్వాత మెల్లగా ‘గెయిన్‌ ఆఫ్‌ ఫంక్షన్స్‌’ ప్రయోగాల వివరాలు బయటకు వస్తున్నాయి. వుహాన్‌ ల్యాబ్‌లోని ఓ కీలక శాస్త్రవేత్త వైరస్‌కు సంబంధించిన కీలక భాగాన్ని అమెరికా శాస్త్రవేత్తలకు ఇచ్చి ఈ ప్రయోగాల్లో పాల్గొన్నారు. అప్పట్లోనే కరోనా వైరస్‌లాగే ఊపిరితిత్తులను దెబ్బతీసే ఓ వైరస్‌కు రూపుకల్పన చేశారు. వుహాన్‌ ల్యాబ్‌లో చేసిన ఇలాంటి ప్రయోగాల ఫలితంగా  ప్రపంచవ్యాప్తంగా 35 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారనే వాదనలు బలపడుతున్న సమయంలో ఈ వివరాలు వెల్లడి కావడం విశేషం.  

2015లో ఏం జరిగింది?

అమెరికా, చైనాలు సంయుక్తంగా ఈ ప్రమాదకర ప్రయోగాలను నిర్వహించాయి. అమెరికాలో ఆ ప్రయోగాలను ఆపేశాక, నిధులు ఇచ్చి చైనాలో కొనసాగించారనే అనుమానాలు ఉన్నాయి.  2015లో అమెరికాలోని యూనివర్శిటీ ఆఫ్‌ నార్త్‌ కరోలినా, చైనాలో వుహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ శాస్త్రవేత్తలు కలిసి ఓ సరికొత్త కరోనా వైరస్‌ను సృష్టించారు. ఇది మానవ  కణాలకు తేలిగ్గా అతుక్కుంటుంది. ఊపిరితిత్తుల్లో పునరుత్పత్తి  అవుతుంది. ఈ ప్రయోగ వివరాలు ‘నేచర్‌’ సైన్స్‌ పత్రికలో ప్రచురితమయ్యాయి. ఈ రెండు బృందాలు కొన్నేళ్లపాటు కలిసి ప్రయోగాలు చేశాయి. 

ఎలాంటి ప్రయోగాలు?

వైరస్‌లలో మార్పులు చేయగా వచ్చే ఫలితాలపై ప్రయోగాలు(గెయిన్‌ ఆఫ్‌ ఫంక్షన్స్‌)  నిర్వహించారు. కొన్ని రకాల వైరస్లకు మ్యుటేషన్‌ అయ్యేటటువంటి పరిస్థితులను కృత్రిమంగా కల్పించి.. అవి కొన్ని తరాలు  మ్యుటేట్‌ అయ్యేలా చేసి, వాటిలో మార్పులపై పరిశోధనలు చేశారు.  ఇందులో వైరస్‌లు వేగంగా వ్యాపించేలా మార్పులు చేయడం వంటివి  కూడా ఉన్నాయి. వీటివల్ల భవిష్యత్తులో వచ్చే మహమ్మారులను అంచనా వేయవచ్చన్నది వారి ఉద్దేశం. 2015లో కరోనాపై చేసిన ప్రయోగమే అమెరికాలో చివరి ‘గెయిన్‌ ఆఫ్‌ ఫంక్షన్‌’ పరిశోధన. ఆ తర్వాత ఒబామా ప్రభుత్వం దానికి నిధులు ఆపేసింది.

స్పైక్‌ ప్రొటిన్‌ను సరఫరా చేసిన షి జియాంగ్‌ లీ

2015లో అమెరికాలో కరోనావైరస్‌పై జరిగిన ప్రయోగంలో అవసరమైన కీలకమైన SHC014-CoV స్పైక్‌ ప్రొటిన్‌ను షి జియాంగ్‌ లీ సరఫరా చేశారు. ఆమె అప్పటికే వుహాన్‌ ల్యాబ్‌లో ప్రయోగాలు చేస్తున్నారు. దీనిని చైనీస్‌ హార్స్‌హు గబ్బిలాల్లోని వైరస్‌ల నుంచి సేకరించారు. దీనిని సార్స్‌లాంటి వైరస్‌కు అమర్చారు. దాంతో ఇది ఎలుకలకు సోకే లక్షణాన్ని సంతరించుకొంది. ఈ ఎలుకలకు సార్స్‌పై పనిచేసే రోగనిరోధక చికిత్సను అందించినా ప్రయోజనం కలుగలేదు. వ్యాక్సిన్లు కూడా పనిచేయలేదు. ఇదే స్పైక్‌ ప్రొటిన్‌ మనుషుల్లోని ఏస్‌2 ఎంజైమ్‌కు అతుక్కొంటుంది. దీని ద్వారా మానవుల్లోకి కూడా ప్రవేశిస్తుంది.

అమెరికాలో ఈ ప్రయోగాలపై ఆందోళనలు పెరిగిపోయాయి. దీంతో దేశీయంగా ప్రయోగాలను నిలిపివేసి, చైనాకు నిధులను ఇచ్చింది. యూనివర్శిటీ ఆఫ్‌ నార్త్‌ కరోలినా వెబ్‌సైట్‌ నుంచి ఇటీవలే ఈ ప్రయోగం వివరాలను తొలగించారు. 

నిధులు నిజమే.. ఎలావాడారో తెలియదు!

అమెరికాలోప్రయోగాలపై నిషేధం విధించాక, యుఎస్‌ ఎన్‌ఐహెచ్‌ నుంచి వుహాన్‌ ల్యాబ్‌కు ఐదేళ్లలో 6 లక్షల డాలర్లు వెళ్లాయని శ్వేతసౌధం వైద్యసలహాదారు ఆంటోనీ ఫౌచీ అంగీకరించారు. అవి ‘గెయిన్‌ ఆఫ్‌ ఫంక్షన్స్‌’ ప్రయోగాలకు ఇవ్వలేదని తెలిపారు. కానీ, చైనా ఇలాంటి ప్రయోగాలు చేయలేదని కచ్చితంగా చెప్పలేనని వెల్లడించారు. 

వుహాన్‌పై ఇందుకే సందేహాలు

గతేడాది కరోనావైరస్‌ వ్యాపించిన సమయంలో ఈ  పరిశోధనపై పలు సందేహాలు వ్యక్తం అయ్యాయి. ఆ వైరస్‌ లక్షణాలు 2015లో తయారు చేసిన వైరస్‌ లక్షణాలను పోలి ఉండటం, వుహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌లో కరోనాపై ప్రయోగాలు జరుగుతుండటం, వుహాన్లోనే వైరస్‌ తొలి కేసులు రావడంతో అనుమానాలు పెరిగాయి. దీంతో 2020లో అమెరికా 2015 వైరస్‌ జన్యుక్రమాన్ని, సార్స్‌కోవ్‌2 జన్యుక్రమాన్ని బహిర్గతం చేసింది. ఈ రెండింటి మధ్య పొంతనలేదు. 

గబ్బలాల నుంచి వైరస్‌ ఆతిథ్య జీవిలోకి చేరి, అక్కడి నుంచి మనిషిలోకి వచ్చిందని శాస్త్రవేత్తలు ఆధారాలతో చెప్పలేకపోతున్నారు. ఆ ఆతిథ్య జీవి ఏదో ఇప్పటికీ తెలియలేదు. వుహాన్‌ నగరం సమీపంలో భారీ సంఖ్యలో గబ్బిలాలు లేవు. దీనికి తోడు అమెరికా ఇంటెలిజెన్స్‌ నివేదికలు వుహాన్‌ ల్యాబ్‌ సిబ్బంది తీవ్రంగా జబ్బుపడిన అంశాన్ని గుర్తించినట్లు వాల్‌స్ట్రీట్‌ పేర్కొనడం కుట్రకోణాలకు బలాన్నిచ్చింది. 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు