ప్రణబ్‌.. భారత రత్న బంధం..!

‘‘గతేడాది ఆగస్టు 8.. నా తండ్రికి భారత రత్న లభించింది.. అది నాకు చాలా సంతోషకరమైన రోజు.. ఈ ఏడాది ఆగస్టు 10న  ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు’’.. ..

Updated : 01 Sep 2020 14:58 IST

అవార్డుల పునరుద్ధరణలో కీలక పాత్ర

‘‘గతేడాది ఆగస్టు 8.. నా తండ్రికి భారత రత్న లభించింది.. అది నాకు చాలా సంతోషకరమైన రోజు.. ఈ ఏడాది ఆగస్టు 10న  ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు’’.. ఇది ప్రణబ్‌ ముఖర్జీ సైనిక ఆసుపత్రిలో చేరిన రోజు ఆయన కుమార్తె శర్మిష్ఠ ముఖర్జీ చేసిన ట్వీట్‌..!. భారత రత్న అవార్డులకు ప్రణబ్‌కు మధ్య ఓ ఆసక్తికరమైన సంబంధం ఉంది.  

ఎమర్జెన్సీ తర్వాత జరిగిన ఎన్నికల్లో  ఇందిరాగాంధీ ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత జనతా ప్రభుత్వం తరఫున అధికారం చేపట్టిన మొరార్జీ దేశాయ్‌ పౌర పురస్కారాలు ఆపేశారు. అప్పటికే ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో తనకు తానే భారత రత్న ప్రకటించుకొని విమర్శల పాలయ్యారు. 1980లో తిరిగి అధికారంలోకి వచ్చిన ఇందిరాగాంధీ భారత్‌ రత్న అవార్డులను తిరిగి ప్రారంభించాలని భావించారు. ఆమెకు అత్యంత నమ్మకమైన వ్యక్తుల్లో ప్రణబ్‌ ముఖర్జీ ఒకరు. ఆయన అప్పట్లో రాజ్యసభలో ఉన్నారు. ఒక రోజు ఇందిర రాజ్యసభలో ప్రణబ్‌ పక్కన కూర్చొన్నారు. పౌరపురస్కారాలను పునఃప్రారంభించాలని.. భారత రత్నకు ఒకరిని ఎంపిక చేయాలని కోరారు.  

వివాదరహిత వ్యక్తులకు ఇవ్వడం ద్వారా దీనిని పునఃప్రారంభించాలని ఆయన సూచించారు. ప్రతిపక్ష విమర్శలకు అస్సలు అవకాశం ఇవ్వకూడదని నిర్ణయించారు. అయితే అవార్డుకు తగిన వ్యక్తి ఎవరు అన్న ప్రశ్నరావడంతో.. ప్రణబ్‌ ఆలోచించి మదర్‌థెరిస్సా పేరు సూచించారు. ఆ పేరు విని ఇందిరాగాంధీ చాలా సంతోషించారు. ఆమె జాతీయతపై ఇందిరాకు సందేహం రావడంతో..  ‘మదర్‌’ భారత పౌరసత్వం తీసుకొన్న విషయాన్ని ప్రణబ్‌ మరోసారి రూఢీ చేసుకొన్నారు. 1980 సంవత్సరానికి భారత రత్నగా మదర్‌ పేరును ప్రకటించారు. దీంతో ఎవరూ ఇందిరా గాంధీని విమర్శించే అవకాశం రాలేదు.

రాజకీయ చాణక్యం..

భారత్‌ రత్న అవార్డు ఒక్కటే ప్రధాని సలహాతో రాష్ట్రపతి ప్రకటిస్తారు. పద్మా అవార్డులను హోంశాఖ క్లియరెన్స్‌తో ప్రధాని , మంత్రివర్గం నిర్ణయిస్తాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలకు చెందిన వ్యక్తి  రాష్ట్రపతి భవన్‌లో ఉంటే కొంత రాజకీయం నడుస్తుంది. చట్టంపై పట్టున్న ప్రణబ్‌ ఇటువంటి ఘర్షణలను లౌక్యంగా నివారించారు. 

ప్రణబ్‌ ముఖర్జీకి సంక్షోభ నివారకుడిగా కాంగ్రెస్‌లో పేరుంది. ఇటువంటి పేరు రావాలంటే రాజకీయాల్లో ఆ నేత కాకలుతీరినవారై ఉండాలి.  రెండోసారి అధికారంలోకి వచ్చిన యూపీఏ భవిష్యత్తును అంచనా వేసి కాంగ్రెస్‌ 2012లో  ప్రణబ్‌ను రాష్ట్రపతిని చేసింది.  2014 భాజపా అధికారంలోకి వచ్చాక మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయికి భారత‌ రత్నా ఇవ్వాలనే ప్రతిపాదనలతో ప్రధాని మోదీ రాష్ట్రపతి ప్రణబ్‌ను కలిశారు. మోదీ ప్రతిపాదనకు ఆయన అంగీకరించారు. కానీ, ఓ సలహా ఇచ్చారు. ఇప్పటికే మరణించిన ఓ గొప్పనేతకు కూడా ఇవ్వాలని సూచించారు. అంతేకాదు మదన్‌ మోహన్‌ మాలవీయ పేరును ఆయన మోదీ ఎదుట పెట్టారు. స్వాతంత్ర్య సేనాని, విద్యావేత్త, బనారస్‌ హిందూ విశ్వవిద్యాలయ స్థాపకుడు, హిందూ మహాసభకు చెందిన వ్యక్తి అయిన ఆయన ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌లో కీలక పాత్ర పోషించారు. మోదీ దీనికి అంగీకరించారు. 2015 సంవత్సరానికి అటల్‌, మాలవీయాలకు భారత రత్న ప్రకటించారు. ప్రణబ్‌ రాష్ట్రపతి భవన్‌లో ఉన్నంతకాలం మంత్రి వర్గంతో ఎటువంటి వివాదాలకు తావివ్వలేదు.

కుమార్తెకు కూడా తెలియదు..

2019 జనవరి 25న సాయంత్రం ప్రధాని మోదీ నుంచి మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌కు ఫోన్‌ వచ్చింది. భారత రత్న అవార్డు మీకు ఇవ్వాలనుకుంటున్నాం.. మీ అంగీకారం కోసం ఫోన్‌ చేశాను అని మోదీ తెలిపారు. అప్పటికే దక్షిణాఫ్రికా అధ్యక్షుడు భారత్‌కు రావడంతో మోదీ వ్యక్తిగతంగా ప్రణబ్‌ వద్దకు రాలేకపోయారు. మోదీ ప్రతిపాదనకు ప్రణబ్ అంగీకరించారు. వెంటనే రాష్ట్రపతి భవన్‌ ప్రకటించింది.  ప్రణబ్‌తోపాటు ఉంటున్న ఆయన కుమార్తె శర్మిష్ఠకు అప్పటి వరకూ ఈ  విషయం తెలియదు. ‘నీకు భారత రత్న వచ్చినా.. ఏమి జరగనట్లే ఉన్నావు. కనీసం నాకు చెప్పలేదు’’ అని ఆగ్రహం వ్యక్తం చేసింది.  

‘‘ఎవరు ఎంత ప్రయత్నించినా.. ప్రణబ్‌ నోటి నుంచి రహస్యాలను రాబట్ట లేరు.. ఆయన పైప్‌ వదిలే పొగ మాత్రమే బయటకు వస్తుంది’’ అని ఇందిరాగాంధీ వ్యాఖ్యానించినట్లు ప్రముఖ జర్నలిస్టు జయంతి ఘోషల్‌ తెలిపారు. ఆయన ఇందిరా గాంధీకి ఎంత విశ్వాసపాత్రుడో ఈ ఘటన తెలియజేస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు