China: చైనాలో మరో సమస్య.. హైవేలు, క్రీడా మైదానాలు మూసివేత!

కొన్నాళ్లుగా వరుస కరోనా కేసులతో సతమతమవుతున్న చైనాకు మరో సమస్య వచ్చిపడింది! ఇటీవల తీవ్ర బొగ్గు కొరతతో.. దేశవ్యాప్తంగా విద్యుత్‌ సంక్షోభం ఏర్పడిన విషయం తెలిసిందే. దీనికి పరిష్కారంగా అధికారులు బొగ్గు ఉత్పత్తి, వినియోగాన్ని భారీగా పెంచేశారు!...

Updated : 05 Nov 2021 16:19 IST

బీజింగ్‌: కొన్నాళ్లుగా వరుస కరోనా కేసులతో సతమతమవుతున్న చైనాకు మరో సమస్య వచ్చిపడింది! ఇటీవల తీవ్ర బొగ్గు కొరతతో.. దేశవ్యాప్తంగా విద్యుత్‌ సంక్షోభం ఏర్పడిన విషయం తెలిసిందే. దీనికి పరిష్కారంగా అధికారులు బొగ్గు ఉత్పత్తి, వినియోగాన్ని భారీగా పెంచేశారు! దీంతో దేశ రాజధాని బీజింగ్‌తోసహా ఆయా నగరాల్లో ఒక్కసారిగా భారీ ఎత్తున వాయు కాలుష్యం పెరిగింది. ఉత్తర చైనాలోనూ దట్టమైన కాలుష్య పొగలు కమ్ముకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 200 మీటర్ల కంటే ఎక్కువ దూరం కనిపించని దుస్థితి. దీంతో శుక్రవారం షాంఘై, టియాంజిన్, హార్బిన్‌తో సహా ప్రధాన నగరాలకు వెళ్లే రహదారులను మూసివేశారు. తీవ్ర వాతావరణ పరిస్థితులు, కాలుష్యం కారణంగా రాజధానిలోని పాఠశాలలు.. ఫిజికల్ ఎడ్యుకేషన్ క్లాసులు, బహిరంగ కార్యకలాపాలను నిలిపేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

చాలా అనారోగ్యకరం అనే స్థాయికి..

బీజింగ్‌లోని అమెరికా రాయబార కార్యాలయ విభాగం శుక్రవారం ఉదయం వాయు నాణ్యతను పరిశీలించగా.. పౌరులకు ‘చాలా అనారోగ్యకరం’ అనే స్థాయికి చేరుకున్నట్లు తేలింది. శ్వాసకోశ వ్యాధులకు కారణమయ్యే పీఎం 2.5 స్థాయిలు దాదాపు 220కి చేరుకున్నాయి. డబ్ల్యూహెచ్‌వో సిఫార్సు చేసిన పరిమితి 15 కంటే ఇది చాలా ఎక్కువ. శనివారం సాయంత్రం వరకు పరిస్థితి ఇలాగే కొనసాగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఫిబ్రవరిలో వింటర్ ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటున్నారు. గ్రీన్‌హౌస్ వాయువులను ఉత్పత్తి చేసే అతిపెద్ద దేశమైన చైనా.. తన విద్యుత్తుత్పత్తిలో 60 శాతం బొగ్గుపై ఆధారపడుతుంది. ఈ క్రమంలో ఇటీవల ఏర్పడిన కొరతను అధిగమించేందుకు రోజువారీ బొగ్గు ఉత్పత్తిని పది లక్షల టన్నులకు పైగా పెంచినట్లు ఈ వారం మొదట్లో తెలిపింది. మరోవైపు 2060 నాటికి ఉద్గారాలను సున్నాకు చేర్చుతామని బీజింగ్ ఇదివరకే వెల్లడించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని