Dilip Ghosh: ‘కడుపు నిండా తిని ఇఫ్తార్ విందులకు వెళ్తారు’.. దీదీపై భాజపా నేత విమర్శలు

తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై భాజపా జాతీయ ఉపాధ్యక్షుడు, ఎంపీ దిలీప్ ఘోష్‌

Published : 07 Jul 2022 02:16 IST

దిల్లీ: తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై భాజపా జాతీయ ఉపాధ్యక్షుడు, ఎంపీ దిలీప్ ఘోష్‌ తీవ్ర విమర్శలు గుప్పించారు. హిందూ, ముస్లిం మతాల పట్ల దీదీ అనైతికంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఆమె హిందూ మతానికి చెందినవారైనప్పటికీ.. కడుపు నిండా తిని ఇఫ్తార్‌ పార్టీలకు వెళ్తారని విమర్శించారు. ఈ మేరకు ‘ఇండియా టుడే కాన్‌క్లేవ్ ఈస్ట్‌ 2022’ కార్యక్రమంలో పాల్గొని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘మన మతాన్ని అనుసరిస్తూ.. ఇతర మతాలను గౌరవించాలి అని అంటూ ఉంటారు. కానీ, ఇక్కడ పూర్తి విరుద్ధంగా జరుగుతుంది. దీదీ హిందూ మతానికి చెందినవారైనప్పటికీ.. నమాజ్‌ చేసి రోజా (ఉపవాసం) పాటిస్తారు. కొన్నిసార్లు కడుపు నిండా తిన్న తర్వాత ఇఫ్తార్‌ విందులకు వెళ్తారు. ఇది ఇస్లాం, హిందూ మతాలను అగౌరవపరచడమే’’ అని దిలీప్‌ ఘోష్‌ వ్యాఖ్యానించారు.

భాజపా మాజీ అధికార ప్రతినిధి నుపుర్‌ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై దిలీప్‌ ఘోష్‌ స్పందిస్తూ.. ‘‘ఆమె చేసిన వ్యాఖ్యల తర్వాత ఎంత మంది మరణించారో నాకైతే తెలియదు. కానీ, స్వాతంత్ర్యానికి ముందు అల్లర్లు చెలరేగి వందల మంది హిందువులు హత్యకు గురయ్యారు. అయినా హిందువులు విశ్వాసం కోల్పోలేదు. ఈ హింస వెనుక ఉన్న భావజాలానికి వ్యతిరేకంగా మాట్లాడేందుకు ఇప్పుడు ప్రపంచమంతా భయపడుతోంది. కానీ, భాజపా, నుపుర్‌ మాత్రం అలా కాదు. ఆమె చేసిన వ్యాఖ్యలు తప్పు అని అనిపిస్తే.. వచ్చి వారించండి. టీవీలో చర్చించండి. మీ వాదనలను పబ్లిక్‌కు తెలియజేయండి’’ అని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని