అన్నీ ఇస్తాం.. వ్యాక్సిన్‌ తయారు చేయించండి

కొవిడ్‌-19 నియంత్రణలో భాగంగా వ్యాక్సిన్‌ తయారు చేసేందుకు భూమితో పాటు, అవసరమైనవన్నీ సమకూరుస్తామని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు.

Updated : 12 May 2021 20:10 IST

కోల్‌కతా: కొవిడ్‌-19 నియంత్రణలో భాగంగా వ్యాక్సిన్‌ తయారు చేసేందుకు భూమితో పాటు, అవసరమైనవన్నీ సమకూరుస్తామని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. బుధవారం ఆమె ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. కొవిడ్‌ వ్యాక్సిన్లు వేగంగా దిగుమతి అయ్యేలా చూడాలని విన్నవించారు. వ్యాక్సిన్ల ఉత్పత్తికి దేశీయ, విదేశీ సంస్థలను ప్రోత్సహించాలన్నారు.

‘‘దేశీయంగా వ్యాక్సిన్‌ తయారీ తగిన స్థాయిలో లేదు. అంతర్జాతీయంగా అనేక మంది వ్యాక్సిన్‌ తయారీదారులు ఉన్నారు. మంచి గుర్తింపు పొందిన, నాణ్యమైన వ్యాక్సిన్‌ తయారీదారులను గుర్తించి వ్యాక్సిన్‌ ఉత్పత్తిని వేగవంతం చేయండి. అందుకు అవసరమైన వనరులు అందించడానికి బెంగాల్‌ ప్రభుత్వం సిద్ధంగా ఉంది’’ అని మమత కోరారు.

వ్యాక్సిన్‌ ఉత్పత్తిని పెంచండి: కేంద్రం

మరోవైపు టీకా ఉత్పత్తి పెంచి వ్యాక్సినేషన్‌ వేగవంతం చేయాలని కేంద్రం నిర్ణయించింది. తయారీ సంస్థలకు అవసరమైన సహకారం అందించడాని సిద్ధమైంది. మే-జూన్‌ నాటికి కొవాగ్జిన్‌ ఉత్పత్తి రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. జులై-ఆగస్టు నాటికి నెలకు 6-7కోట్ల డోసులు, సెప్టెంబరు నాటికి నెలకు 10 కోట్ల టీకా డోసులు ఉత్పత్తి చేయాలని ప్రణాళిక సిద్ధం చేస్తోంది. కొవాగ్జిన్‌ డోసుల ఉత్పత్తి సామర్థ్యం కొన్ని సంస్థలకే ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని