CV Ananda Bose: ‘తక్షణం రాజ్‌భవన్‌ నుంచి వెళ్లిపోండి..’.. పోలీసులకు బెంగాల్‌ గవర్నర్‌ ఆదేశం

పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ సి.వి. ఆనంద బోస్‌ కోల్‌కతా పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. వారిని తక్షణమే రాజ్‌భవన్‌ నుంచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేశారు.

Published : 17 Jun 2024 14:18 IST

కోల్‌కతా: రాజ్‌భవన్‌ వద్ద ఉన్న కోల్‌కతా పోలీసు సిబ్బంది పనితీరుపై పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ (West Bengal Governor) సి.వి.ఆనంద బోస్‌ (CV Ananda Bose) ఆగ్రహం వ్యక్తంచేశారు. తక్షణమే వారిని కార్యాలయం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించారు.  బాధితులతో కలిసి తనను కలిసేందుకు వచ్చిన సువేందు అధికారిని పోలీసులు అడ్డుకోవడమే అందుకు కారణమని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

లోక్‌సభ ఎన్నికల అనంతరం జరిగిన హింస బాధితులతో (దాదాపు 200 మంది) కలిసి రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష (భాజపా) నేత సువేందు అధికారి ఇటీవల రాష్ట్ర గవర్నర్‌ సి.వి.ఆనంద బోస్‌ను కలిసేందుకు వెళ్లారు. అయితే.. ఆయనను అక్కడున్న పోలీసు సిబ్బంది అడ్డుకున్నారు. రాజ్‌భవన్‌ వెలుపల 144 సెక్షను అమలులో ఉన్నందున గుంపుగా రావడాన్ని అనుమతించమని తేల్చి చెప్పారు. గవర్నర్‌ను కలిసేందుకు అపాయింట్‌మెంటు కూడా తీసుకున్నానని.. బాధితులకు న్యాయం చేయాలని కోరేందుకే వచ్చామని ఎంత చెప్పినా వినిపించుకోలేదు.

సురక్షిత భావన కలగడం లేదు..

గంటసేపు ఎదురుచూసినా లోనికి అనుమతించలేదు. ఈ వ్యవహారం తన దృష్టికి రావడంతో పోలీసుల తీరుపై గవర్నర్‌ మండిపడ్డారు. తన ఆదేశాలను వారు ఏమాత్రం పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తంచేసినట్లు తెలుస్తోంది. వారు ఇక్కడ ఉంటే తాను సురక్షితంగా ఉన్నానన్న భావన కలగడం లేదన్నారని సమాచారం.

బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. సీఐడీ ముందు హాజరైన యడియూరప్ప

దీంతో తక్షణమే పోలీసు సిబ్బంది సహా ఇన్‌ఛార్జి అధికారిని రాజ్‌భవన్‌ ప్రాంగణాన్ని విడిచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. రాజ్‌భవన్ ఉత్తర ద్వార సమీపంలో ఉన్న ఔట్‌పోస్టును ‘జన్‌ మంచ్‌’ (ప్రజావేదిక)గా మార్చేందుకు ఆనంద్‌ బోస్‌ యోచిస్తున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని