Pushpa: మంత్రి నోట ‘పుష్ప’ డైలాగ్.. బెంగాల్‌ రాజకీయాల్లో దుమారం!

‘పుష్ప’ సినిమాలోని డైలాగ్‌ను ఉటంకిస్తూ పశ్చిమ బెంగాల్‌ మంత్రి మనోజ్‌ తివారీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీంతో ఆయన చివరకు క్షమాపణలు చెప్పారు.

Published : 12 Dec 2022 15:46 IST

కోల్‌కతా: టీఎంసీ నేత, పశ్చిమ బెంగాల్‌(West Bengal) మంత్రి నోట ‘పుష్ప(Pushpa)’ సినిమా డైలాగ్‌.. స్థానిక రాజకీయాల్లో వివాదానికి దారితీసింది. ‘ఝుకేగా నహీ..’ అంటూ భాజపా(BJP)ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై చివరకు ఆయన క్షమాపణలు చెప్పారు. మరోవైపు ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించిన కమలదళం.. మొత్తం బెంగాల్‌ ప్రభుత్వం 'పుష్ప' సినిమాలా కనిపిస్తోందని, సదరు మంత్రి వ్యాఖ్యలు టీఎంసీ స్వభావాన్ని ప్రతిబింబిస్తున్నాయని విమర్శించింది.

టీఎంసీ మంత్రి మనోజ్‌ తివారీ(Manoj Tiwary) ఆదివారం ఓ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. పార్టీ శ్రేణులంతా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే ‘భాజపా కార్యకర్తలారా.. పుష్ప సినిమా డైలాగులు వినండి. ‘ఝుకేగా నహీ..’ అంటూ సవాల్‌ విసురుతోన్న శైలిలో వ్యాఖ్యానించారు. ఇది కాస్త వివాదాస్పదమైంది. దీనిపై భాజపా రాష్ట్ర కార్యదర్శి ఉమేశ్‌ రాయ్‌ స్పందిస్తూ.. మొత్తం బెంగాల్‌ ప్రభుత్వం ‘పుష్ప’ సినిమాలా మారిందన్నారు.

‘బెంగాల్‌ యువత హక్కులను కాలరాసిన ఈ నేత(మనోజ్‌ తివారీ) మాట్లాడిన, ప్రవర్తించిన తీరు.. ఆ సినిమాలోని ఎర్రచందనం స్మగ్లర్‌ మాదిరే ఉంది. ఇదీ తృణమూల్ నిజస్వరూపం’ అని విమర్శించారు. మరోవైపు.. తన వ్యాఖ్యలు దుమారానికి దారితీయడంతో మంత్రి.. క్షమాపణలు తెలిపారు. తాను అలా మాట్లాడకుండా ఉండాల్సిందన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు