పోలింగ్‌ రక్తసిక్తం.. బెంగాల్‌లో 76.16% ఓటింగ్‌‌! 

బెంగాల్‌లో నాలుగో విడత పోలింగ్‌ హింసాత్మక ఘటనల మధ్య ముగిసింది. ఓటర్లు 44 అసెంబ్లీ స్థానాల్లో బరిలో నిలిచిన 373 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంల్లో నిక్షిప్తం చేశారు

Published : 10 Apr 2021 20:29 IST

కోల్‌కతా: బెంగాల్‌లో నాలుగో విడత పోలింగ్‌ హింసాత్మక ఘటనల మధ్య ముగిసింది. ఓటర్లు 44 అసెంబ్లీ స్థానాల్లో బరిలో నిలిచిన 373 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంల్లో నిక్షిప్తం చేశారు. సాయంత్రం ఐదు గంటల సమయానికి 76.16 శాతం పోలింగ్‌ నమోదైంది. మండే ఎండలను సైతం లెక్కచేయకుండా ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. అధికారులు కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పోలింగ్ నిర్వహించారు. కోల్‌కతాలో బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. బెంగాల్‌లో 294 స్థానాలకు ఎనిమిది దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్న సంగతి విదితమే. తొలి మూడు దశల్లో 91 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఐదో దశ పోలింగ్‌ ఈ నెల 17న జరగనుంది. ఫలితాలు మే 2న వెలువడుతాయి.

బెంగాల్‌ నాలుగో దశ ఎన్నికల్లో కోచ్‌బిహార్‌లో చెలరేగిన హింసాత్మక ఘటనల్లో ఐదుగురు మృతి చెందారు. సీతాల్‌కోచ్‌లో 150 మంది వ్యక్తులు పోలీసులపై దాడులకు యత్నించగా వారిని అదుపు చేసేందుకు సీఐఎస్‌ఎఫ్‌ జవాన్లు కాల్పులు జరిపారు. ఈ సంఘటనలో నలుగురు మృతిచెందారు. ఆత్మ రక్షణ కోసమే కాల్పులు జరపాల్సి వచ్చిందని అధికారులు వివరణ ఇచ్చారు. కాల్పులకు దారితీసిన పరిస్థితులపై ఈసీ కారణం అడిగింది. ఈ హింసాత్మక ఘటనలపై భాజపా, తృణమూల్‌ కాంగ్రెస్‌ పరస్పర ఆరోపణలకు దిగాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని