Covid restrictions: బెంగాల్‌లో మళ్లీ ఆంక్షలు: విద్యాసంస్థల మూసివేత

పశ్చిమ బెంగాల్‌లో ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసులు సహా రోజువారీ కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మళ్లీ ఆంక్షలు విధిస్తూ....

Updated : 02 Jan 2022 21:59 IST

50శాతం ఉద్యోగులతోనే కార్యాలయాలు

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసులు సహా రోజువారీ కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మళ్లీ ఆంక్షలు విధిస్తూ దీదీ ప్రభుత్వం ఆదివారం నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి విద్యాసంస్థలు మూసివేయాలని, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు 50శాతం ఉద్యోగులతో మాత్రమే పనిచేయాలని సూచించారు. కార్యాలయాల్లో అన్ని రకాల అడ్మినిస్ర్టేటివ్‌ సమావేశాలు వర్చువల్‌గా నిర్వహించాలని రాష్ట్ర సీఎస్‌ హెచ్‌.కే.ద్వివేది ఆదేశించారు. వీలైనంత వరకు వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ను ప్రోత్సహించాలని సూచించారు.ఇప్పటికే హర్యానా, దిల్లీ, ఉత్తర ప్రదేశ్‌లలో రాత్రి కర్ఫ్యూ విధించగా బెంగాల్‌లోనూ రాత్రి 10నుంచి ఉదయం 5వరకు కర్ఫ్యూ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.ఈ సమయాల్లో కేవలం అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు.

సోమవారం నుంచి బెంగాల్‌లోని పాఠశాలలు, కళాశాలలు, వర్సిటీలు మూసివేయాలని ఆదేశించారు. జూపార్కులు, సెలూన్లు, స్పాలు, బ్యూటీపార్లర్లు, స్విమ్మింగ్ పూల్స్‌, జిమ్‌లు, వెల్‌నెస్‌ సెంటర్లు  మూసివేయాలని ఆదేశాలిచ్చారు. కోల్‌కతాలో మెట్రో రైళ్లు 50శాతం సామర్థ్యంతో పనిచేయాలని ఉత్తర్వులిచ్చారు. లోకల్‌ రైళ్లను కూడా రాత్రి 7గంటల వరకు మాత్రమే నడపనున్నట్లు తెలిపారు. సుదూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లు మాత్రం యథావిథిగా నడుస్తాయన్నారు. సినిమా హాళ్లు, బార్లు, రెస్టారెంట్లు 50శాతం సామర్థ్యంతో రాత్రి 10గంటల వరకు మాత్రమే నడపాలని ఉత్తర్వులిచ్చారు. షాపింగ్‌ మాల్స్‌ ఉదయం 10నుంచి సాయంత్రం 5గంటల వరకు పనిచేసేందుకు అనుమతి ఇస్తూ తప్పనిసరిగా 50శాతం మేర మాత్రమే కొనుగోలు దారులను అనుమతించాలని సూచించారు.వివాహాలు, సాంఘిక, మతపరమైన కార్యక్రమాలకు 50మందికి మాత్రమే అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంత్యక్రియలకు 20మందికి మాత్రమే అనుమతిస్తున్నట్లు తెలిపారు.బెంగాల్‌లో శనివారం 4,512 కొత్త కోవిడ్‌ కేసులు నమోదు కాగా, కేసుల నమోదులో మహారాష్ట్ర, కేరళ తర్వాత బెంగాల్‌ మూడో స్థానంలో ఉండటం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని