Bengal: రాష్ట్ర వర్సిటీలకు ఛాన్సలర్‌గా సీఎం.. త్వరలో దీదీ సర్కార్‌ బిల్లు..!

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని విశ్వవిద్యాలయాలకు.....

Published : 27 May 2022 01:43 IST

ప్రతిపాదనకు కేబినెట్‌ ఆమోద ముద్ర

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్‌గా ఇక నుంచి ముఖ్యమంత్రి వ్యవహరించేలా త్వరలోనే బిల్లు తీసుకురావాలని నిర్ణయించింది. ఈ మేరకు గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో వచ్చిన ఈ ప్రతిపాదనకు మంత్రులు అంగీకారం తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్‌గా గవర్నర్‌ వ్యవహరిస్తుండగా.. బెంగాల్‌లో ఆ హోదాను సీఎంకు మార్చాలన్న ప్రతిపాదనకు ఆమోద ముద్ర పడిందని.. దీనికి సంబంధించిన బిల్లు త్వరలోనే అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్టు బెంగాల్‌ విద్యాశాఖ మంత్రి బ్రాత్య బసు వెల్లడించారు. ‘ఈరోజు కేబినెట్‌ సమావేశంలో రాష్ట్రం ఆధ్వర్యంలో నడిచే విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్‌గా గవర్నర్‌ కాకుండా సీఎం వ్యవహరించాలన్న ప్రతిపాదనకు మంత్రివర్గం అంగీకారం తెలిపింది. ఈ ప్రతిపాదనపై త్వరలోనే అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టబోతున్నాం’’ అని మంత్రి అన్నారు.

పశ్చిమబెంగాల్‌ కేబినెట్‌ తీసుకున్న ఈ నిర్ణయం మరోసారి దీదీ Vs గవర్నర్‌గా మారే అవకాశం ఉంది. ఈ ఏడాది జనవరిలో రాష్ట్ర ప్రభుత్వం తన సమ్మతి లేకుండా 25 రాష్ట్ర యూనివర్సిటీలకు వైస్‌ ఛాన్సలర్లను నియమించిందని గవర్నర్‌ ఆరోపించడం వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. అయితే, దీనిపై ప్రభుత్వం స్పందిస్తూ.. సెర్చ్ కమిటీ ఎంపిక చేసిన వైస్ ఛాన్సలర్ల పేర్లను గవర్నర్ ఆమోదించించాల్సి ఉంటుందని, కానీ ఆయన నిరాకరించినట్లయితే విద్యాశాఖ తన సొంత నిర్ణయంతో ముందుకెళ్లే అధికారం కలిగి ఉందని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే అన్ని విశ్వవిద్యాలయాలకు గవర్నర్‌ ఎక్స్‌ అఫిషియో ఛాన్సలర్‌గా ఉండాలన్నది వలసవాద వారసత్వమని, దీన్ని సమీక్షించి.. ఆ స్థానాల్లో స్కాలర్లను నియమించాలని అప్పట్లో ప్రభుత్వం పేర్కొంది. 

బెంగాల్ రాజ్‌భవన్‌ అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. రాష్ట్రంలోని 17 విశ్వవిద్యాలయాలకు గవర్నర్‌ ఛాన్సలర్‌గా వ్యవహరిస్తున్నారు. వీటిలో యూనివర్సిటీ ఆఫ్‌ కలకత్తా, జాదవ్‌పూర్‌ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ కల్యాణి, రవీంద్ర భారతి యూనివర్సిటీ, విద్యాసాగర్‌ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ బుర్ద్వాన్‌, నార్త్‌ బెంగాల్‌ యూనివర్సిటీ వంటివి ఉన్నాయి. శాంతినికేతన్‌లోని విశ్వభారతికి గవర్నర్‌ రెక్టార్‌గా ఉండగా.. ప్రధాని నరేంద్ర మోదీ ఛాన్సలర్‌గా కొనసాగుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని