Viral video: అమెజాన్‌ ఆర్డర్‌ పార్సిల్‌లో పాము..వీడియో వైరల్‌

ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసిన ఓ జంటకు భయంకరమైన అనుభవం ఎదురైంది.

Updated : 19 Jun 2024 14:55 IST

బెంగళూరు: ఆన్‌లైన్‌ షాపింగ్‌లో భాగంగా అమెజాన్‌(Amazon)లో Xbox కంట్రోలర్‌ను ఆర్డర్‌ చేసిన ఓ జంటకు భయంకరమైన అనుభవం ఎదురైంది. బెంగళూరు (Bengaluru)కు చెందిన ఓ జంట తమకు వచ్చిన అమెజాన్‌ ఆర్డర్‌ను విప్పడానికి ప్రయత్నించగా అందులోంచి పాము(cobra) బయటకు రావడంతో వారు భయాందోళన చెందారు. అయితే ప్యాకింగ్‌కు ఉన్న టేప్‌ చుట్టుకోవడంతో పాము బయటకు రాలేకపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో వైరల్‌గా మారింది.

అమెజాన్‌ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల తమ ప్రాణాలకు ముప్పు కలిగే పరిస్థితి ఏర్పడిందని వారు ఆగ్రహం వ్యక్తంచేశారు. సంస్థ భద్రతా చర్యలను పాటించకుండా ఉండడం వల్లే ఈవిధంగా జరిగిందన్నారు. అమెజాన్‌ దీనిపై స్పందిస్తూ డబ్బు రీఫండ్‌ చేశామని తెలిపిందే కాని, క్షమాపణలు కూడా తెలపలేదని మండిపడ్డారు.

వీడియో వైరల్‌ అవడంతో నెటిజన్లు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఓ నెటిజన్‌  స్పందిస్తూ ‘ఈ రోజుల్లో ఆన్‌లైన్‌ డెలివరీలను నమ్మలేము. కొద్ది రోజుల క్రితం డెలివరీ బాయ్ నాకు కాల్‌ చేసి మీ ఇల్లు దూరంగా ఉంది కాబట్టి డెలివరీ చేయలేకపోతున్నాం. ఆఫీస్‌కు వచ్చి ఆర్డర్‌ తీసుకోవాలని కోరాడు’ అని పేర్కొన్నారు. ‘అమెజాన్‌ ఇప్పుడు పాములను కూడా డెలివరీ చేస్తుంది. అందుకే ఆన్ లైన్ షాపింగ్‌లో అగ్రగామిగా ఉంది’ అంటూ మరో నెటిజన్‌ స్పందించారు. ఇంకో నెటిజన్‌ స్పందిస్తూ ‘బ్రో దీనిని అమెజాన్ నుంచి కాదు అమెజాన్ అడవి నుంచి ఆర్డర్ చేశారేమో’ అని చమత్కరించారు.

వైరల్‌ పోస్ట్‌పై స్పందించిన అమెజాన్‌ తమ తప్పిదానికి క్షమాపణలు కోరింది. ఆర్డర్‌ వివరాలు తెలిపితే ప్రాడక్ట్‌ను మళ్లీ డెలివరీ చేస్తామని తెలిపింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు