self bicycle repair: బెంగళూరులో తొలి సెల్ఫ్‌ సర్వీస్‌ సైకిల్‌ రిపేర్‌ కియోస్క్‌

ద్విచక్రవాహనాల విస్తృత వినియోగంతో దేశవ్యాప్తంగా పల్లెలు మొదలు పట్టణాల వరకు సైకిళ్ల వాడకం దాదాపుగా తగ్గిపోయింది. వాస్తవంగా..

Updated : 23 Nov 2022 10:04 IST

                   మన సైకిళ్లను మనమే రిపేర్‌ చేసుకునే ఏర్పాటు

బెంగళూరు: ద్విచక్రవాహనాల విస్తృత వినియోగంతో దేశవ్యాప్తంగా పల్లెలు మొదలు పట్టణాల వరకు సైకిళ్ల వాడకం దాదాపుగా తగ్గిపోయింది. వాస్తవంగా చెప్పాలంటే పల్లెలతో పోలిస్తే ప్రముఖ నగరాల్లోనే సైక్లిస్టులు కనిపిస్తున్నారు. నగర వాసుల జీవన శైలి, ఆఫీసుల్లో కుర్చీలకు పరిమితమై రోజంతా విధులు నిర్వర్తించడం వంటి కారణాలతో శారీరక వ్యాయామంలో భాగంగా సైక్లింగ్‌ నగర వాసుల దినచర్యలో భాగమైంది. కరోనా వచ్చాక ఆరోగ్యంపై దృష్టి సారించిన పలువురు ఐటీ ఉద్యోగులు, యువత సైక్లింగ్‌పై దృష్టి సారించారు. దీంతో నగరాల్లో సైక్లిస్టుల సంఖ్య పెరగడంతో సైకిళ్ల అమ్మకాలు కరోనా తర్వాత అధికమైనట్లు దుకాణదారులు పేర్కొంటున్నారు. అయితే సైకిళ్ల సంఖ్య పెరగ్గా వాటిని రిపేరు చేసే దుకాణాలు మాత్రం అనేక కారణాల వలన రోజురోజుకూ తగ్గిపోతున్నాయి. ముఖ్యంగా బెంగళూరులో సైకిళ్లకు ప్రజాదరణ ఉన్నప్పటికీ సైకిల్‌ రిపేరు దుకాణాలు నామమాత్రంగా మారాయి.ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం ఏజెన్సీ ఆధ్వర్యంలో ‘పెడల్‌ పోర్ట్‌’ ఏర్పాటు చేసింది.ఇది సైకిళ్లను రిపేర్‌ చేసుకోవడానికి ఏర్పాటు చేసిన స్వీయ సేవా కియోస్క్‌. ఇక్కడ సైకిళ్లను మనమే రిపేరు చేసుకోవాలి.దేశంలోనే స్వీయ సేవా కియోస్క్‌కు ఏకైక ఏజెన్సీగా చెప్పుకునే డైరెక్టరేట్‌ ఆఫ్‌ అర్బన్‌ ల్యాండ్‌ ట్రాన్స్‌పోర్ట్  బెంగళూరులో డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ మెట్రో స్టేషన్‌ వద్ద విధాన సౌధకు సమీపంలో మొదటి పెడల్‌ పోర్టును ఏర్పాటు చేసింది.

సైక్లింగ్‌కు ఊతమివ్వాలని

పెడల్‌ పోర్ట్‌ గురించి సీనియర్‌ అధికారి మాట్లాడుతూ.. సైకిల్‌ పంపులు, టైర్‌ లివర్లు, అలెన్‌కీలు, స్క్రూడ్రైవర్లు, స్పానర్లు వంటి వాటిని పెడల్‌పోర్ట్‌లో స్వీయ సేవ కోసం అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోనే తొలిసారిగా ఇలాంటి కియోస్క్‌ ఏర్పాటు చేసినట్లు ఇక్కడ టైర్‌లకు పంక్చర్‌ వేసుకోవడం, గాలిని నింపుకోవడం, సీట్‌పోస్ట్‌లను బిగించుకోవచ్చని అధికారులు తెలిపారు. కర్ణాటకలోని నగరాల్లో సైక్లింగ్‌ను ప్రాచుర్యంలోకి తీసుకురావడం కోసం ఏజెన్సీ ముందుంటుందని తెలిపారు. నగరాల్లో  పెడల్‌ పోర్ట్ ఓ వినూత్న కార్యక్రమమని వెల్లడించారు. దేశంలో తొలిసారిగా పట్టణ కేంద్రాల్లో సైక్లిస్టులు, పాదచారుల హక్కులను పరిరక్షించేందుకు ఏజెన్సీ యాక్టివ్‌ మొబిలిటీ బిల్లుకు సంబంధించి ముసాయిదాను సిద్ధం చేసిందని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో వీధులు, బహిరంగ ప్రదేశాలను డిజైన్‌ చేయడం, ప్రజల అవసరాల దృష్ట్యా వీధులను అభివృద్ధి చేయడం, తద్వారా రోడ్ల పట్ల వారిలో స్పృహ కల్గించేలా చేయడం బిల్లు ముఖ్య ఉద్ధేశమని తెలిపారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని