Bengaluru Rains: బెంగళూరును ముంచెత్తిన వర్షం.. వరదల్లో కొట్టుకుపోయిన రూ.2 కోట్ల బంగారం..!

Bengaluru Rains: కర్ణాటక రాజధాని బెంగళూరులో కురిసిన భారీ వర్షాలు ఓ నగల దుకాణానికి తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. వరదనీటిలో రూ.రెండు కోట్ల విలువైన బంగారం కొట్టుకుపోయిందని దుకాణం యజమాని వాపోయారు.

Updated : 23 May 2023 15:27 IST

బెంగళూరు: ఐటీ రాజధాని బెంగళూరు(Bengaluru)ను అకాల వర్షాలు ముంచెత్తాయి. కర్ణాటక(Karnataka)లో పలు ప్రాంతాల్లో కురిసిన వర్షాల కారణంగా జన జీవనం అస్తవ్యస్తమైంది. ఈ వరదల వల్ల బెంగళూరులోని ఓ బంగారం దుకాణం తీవ్రంగా నష్టపోయింది. ఆకస్మికంగా వరద నీరు దుకాణంలోకి చేరడంతో బంగారు ఆభరణాలు కొట్టుకొనిపోయాయని యజమాని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. (Bengaluru Rains)

ఇదీ చదవండి: ఆమె చీర.. ఐదుగురి ప్రాణాలు నిలిపింది

బెంగళూరులోని మల్లేశ్వర్‌ ప్రాంతానికి చెందిన నగల దుకాణం(Jewellery Shop) వరదనీటిలో చిక్కుకుంది. అక్కడికి దగ్గర్లో జరుగుతున్న నిర్మాణ పనులే  ఈ వరదకు కారణమని దుకాణం యజమాని ఆరోపించారు. చెత్తాచెదారం కలిసిన వరదనీరు షాపులోకి ఒక్కసారిగా పోటెత్తడంతో.. అక్కడి సిబ్బంది షటర్లు మూయలేకపోయారని తెలుస్తోంది. ‘వెంటనే మున్సిపల్ అధికారులకు ఫోన్‌ చేసి, సహాయం కోరాం. కానీ మాకు సహాయం చేసేందుకు వారు రాలేదు. ఆ వరదనీటిలో 80 శాతం బంగారం కొట్టుకుపోయింది. దాని మొత్తం విలువ రెండుకోట్ల రూపాయల వరకు ఉంటుంది’ అని యజమాని వాపోయారు.

ఈ అకాల వర్షాల కారణంగా కాలువలు పొంగుతున్నాయి. రహదారులనిండా చెత్త పేరుకుపోయింది. దానిని తొలగించలేక మున్సిపల్ సిబ్బంది తీవ్ర అవస్థలు పడుతున్నారు. చెట్లు కూలిపోయాయని, వరద నీరు నిలిచిపోయిందంటూ సుమారు 600 వరకు ఫిర్యాదులు అందాయి. ఇదిలా ఉంటే.. ఆదివారం కేఆర్‌ కూడలి సమీప అండర్‌ పాస్‌లోకి పొంగుకొచ్చిన నీటిలో మునిగి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన భానురేఖ అనే టెకీ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ వర్షాల కారణంగా రాష్ట్రంలో ఇప్పటివరకు ఐదుగురు మృతి చెందారని అధికారులు తెలిపారు. తాజాగా 31 ఏళ్ల వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని