
బెంగళూరులో కరోనా విశ్వరూపం
బెంగళూరు: కర్ణాటకలో కరోనా కోరలు చాస్తోంది. వైరస్ బాధితుల సంఖ్య అక్కడ 13లక్షల మార్కును దాటేసింది. తాజాగా 29,438 కేసులు రాగా.. 208 మరణాలు నమోదయ్యాయి. ఈ రోజు మరో 9058మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. దీంతో మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 13,04,397కి చేరింది. వీరిలో 10,55,612మంది కోలుకోగా.. 14,283మంది మరణించారు. ప్రస్తుతం 2,34,483 క్రియాశీల కేసులు ఉన్నాయి. ఇకపోతే, బెంగళూరు మహానగరంలో కరోనా విశ్వరూపం చూపిస్తోంది. వీకెండ్ లాక్డౌన్ సహా కఠిన ఆంక్షలు అమలుచేస్తున్నా వైరస్ ఉద్ధృతి ఆగడంలేదు. శనివారం ఒక్కరోజే బెంగళూరు నగరంలో 17వేలకు పైగా కొత్త కేసులు నమోదు కావడం అక్కడ వైరస్ తీవ్రతకు నిదర్శనం. కరోనా విజృంభిస్తున్న తరుణంలో వైరస్ గొలుసును ఛేదించేందుకు రాష్ట్రంలో మరో రెండు వారాల పాటు లాక్డౌన్ సహా కఠిన ఆంక్షలు అమలుచేయాలని కొవిడ్ సాంకేతిక సలహా కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. కొవిడ్ సంక్షోభం నుంచి బయటపడేందుకు ఆస్పత్రుల్లో పడకల సంఖ్య పెంచాలని కోరింది.