Bengaluru: అధికారులకు చెంపపెట్టు.. చేయి చేయి కలిపి స్వయంగా రోడ్డు బాగు చేసుకొని!

బెంగళూరులోని ఓ ప్రాంతంలో అధ్వానంగా మారిన రోడ్డును శుభ్రం చేసేందుకు అధికారులు నిర్లక్ష్యం వహించారు. దీంతో రంగంలోకి దిగిన ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, స్థానికులు స్వయంగా రోడ్డును బాగు చేసుకోవడంపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ స్పందించారు. 

Published : 26 Jun 2024 15:28 IST

బెంగళూరు: కనీస మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన నగరపాలక సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరించింది. నిధులు లేవనే సాకుతో ముఖం చాటేసింది. పలుమార్లు విజ్ఞప్తులు చేసినప్పటికీ స్పందించకపోవడంతో విసుగెత్తిపోయిన విద్యార్థులు, ఉద్యోగులు, ఐటీ నిపుణులు.. స్వయంగా రంగంలోకి దిగారు. చేయిచేయి కలిపి ప్రమాదకరంగా మారిన రోడ్లను సొంతంగా బాగు చేసుకున్నారు. ఈ ఘటన బెంగళూరు (Bengaluru) నగరంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..

నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే బలగేరే ప్రాంతంలో రోడ్లు అధ్వానంగా మారాయి. గుంతలు ఏర్పడటంతో ప్రమాదకర పరిస్థితి నెలకొంది. దీంతో రోడ్లను శుభ్రం చేసి బాగు చేయాలని స్థానికులు బెంగళూరు మహానగరపాలక సంస్థ (బీబీఎంపీ)కు ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశారు. నిధులు లేవనే కారణాలు చెబుతూ అధికారులు చర్యలు తీసుకోలేదు. దీంతో స్వయంగా రంగంలోకి దిగిన పౌరులు రోడ్లను శుభ్రం చేశారు. వీరిలో ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, స్థానికులు కూడా ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

అధికారుల నిర్లక్ష్యంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘ఇది నిజంగా అద్భుతం. అధికారులు పనులు చేస్తారని ఎదురుచూడకుండా నగరాన్ని శుభ్రం చేయడం గొప్ప విషయం’’ అని ఒకరు.. ‘‘మీ అందరికీ నా సెల్యూట్‌. ప్రతిఒక్కరూ ఇలానే ఆలోచిస్తే.. ప్రమాదాలను కొంతైనా నివారించవచ్చు’’.. ‘‘నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులకు ఈ చర్య చెంపపెట్టు’’ అని కామెంట్లు గుప్పించారు.

అబ్దుల్‌ కలాం ఫోన్‌ చేస్తే రాంగ్‌ నంబర్‌ అని చెప్పా: సుధామూర్తి

వైరల్‌గా మారిన ఈ వీడియోపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ (DK Shivakumar) స్పందించారు. ‘‘కొన్నిసార్లు కొన్ని చర్యలు మనకు ఎన్నో ఉత్తమ పాఠాలు నేర్పుతాయి. బెంగళూరు వాసులు రోడ్లను శుభ్రం చేయడం నా దృష్టికి వచ్చింది. ప్రజల భద్రత మాకు ఎంతో ముఖ్యం. రోడ్ల సమస్యపై తక్షణం చర్యలు తీసుకోవాలని.. ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్త వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించా’’ అని పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని