Bengaluru: ట్రాఫిక్‌లోనే.. కూరగాయలు తరిగిన మహిళ

బెంగళూరులో ఓ మహిళ ఒకవైపు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయినా.. సమయం వృథా చేయకుండా మరోవైపు తన పనిని పూర్తి చేసుకున్నారు.  

Published : 18 Sep 2023 17:45 IST

బెంగళూరు: దేశ ఐటీ రాజధాని బెంగళూరు (Bengaluru)లో ట్రాఫిక్‌ (Traffic)ను దాటుకొని తమ గమ్యస్థానాలను చేరుకునేందుకు నగర ప్రజలు గంటల తరబడి ఎదురుచూడాల్సిందే. అయితే, ఈ సమస్య కారణంగా సకాలంలో తమ పనులను పూర్తి చేసుకోలేక ఇబ్బందులు పడుతుంటారు. వారి కష్టాలను సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంటుంటారు. తాజాగా ఒక మహిళా ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయినా.. తన సమయాన్ని ఏ మాత్రం వృథా చేయలేదు. ఇంతకీ ఆమె ఏం చేసిందంటే..

ప్రియా అనే మహిళా ఒకవైపు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయినా.. మరోవైపు వాహనంలో కూర్చోని ఎంచక్కా కూరగాయలను తరిగేసుకున్నారు. అంతేకాకుండా దీనికి సంబంధించిన ఫొటోను ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఈ పోస్టు వైరల్‌గా మారడంతో నెటిజన్లు కామెంట్లు గుప్పిస్తున్నారు. ‘‘ఒకవేళ హైడ్రోపోనిక్స్‌ ఫామ్‌ను ప్రారంభించాలనే ఆలోచనతో మొక్కలను తీసువెళ్తే.. ట్రాఫిక్‌ను దాటే లోపే అవి పెరిగిపోతాయేమో’’ అని ఒకరు ఫన్నీగా కామెంట్‌ చేశారు. ‘‘ఈ పోస్టును నా బాస్‌కు పంపుతాను’’ అని మరొకరు పోస్టు చేశారు. ‘‘ఆలోచన బాగుంది. ఇకపై ట్రాఫిక్‌ కారణంగా మన పనులను వాయిదా వేసుకునే అవసరం ఉండదు’’ అని పోస్టు పెడుతున్నారు. గతంలో ఒక వ్యక్తి ట్రాఫిక్‌లో ఉన్న కూడా తన భోజనాన్ని పూర్తి చేసిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉండగా..  ట్రాఫిక్‌ అంతరాయాలు, సిగ్నళ్ల వద్ద వేచి ఉండటం వంటి వాటి వల్ల సమయం, ఇంధనం వృథా కావడంతో బెంగళూరు నగరానికి ఏటా రూ.19,725 కోట్లు నష్టం వాటిల్లుతోందని ఒక సర్వేలో వెల్లడైంది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని