Resort Murder: ‘వ్యభిచార కూపంలోకి లాగేందుకు యత్నిస్తున్నారు’.. ఆ యువతి ఆవేదన

కనిపించకుండాపోయి, శవమై తేలిన ఉత్తరాఖండ్‌ యువతి (19) ‘రిసార్టు హత్య’ కేసు దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది.........

Published : 25 Sep 2022 01:32 IST

దేహ్రాదూన్‌: కనిపించకుండాపోయి, శవమై తేలిన ఉత్తరాఖండ్‌ యువతి (19) ‘రిసార్టు హత్య’ కేసు దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. రిసార్టుకు వచ్చే అతిథులకు ‘ప్రత్యేక సేవలు’ అందించేందుకు నిరాకరించడం వల్లే ఆమెను హత్యచేసినట్లు ఇప్పటికే పోలీసులు వెల్లడించారు. రిసార్టుకు వచ్చే అతిథులతో శృంగారం చేయాలని యువతిపై యజమాని ఒత్తిడి తెచ్చాడని, అందుకు ఆమె నిరాకరించడంతో ఈ హత్యకు పాల్పడినట్లు తెలిపారు. కాగా ఆ యువతిపై అమానుషానికి సంబంధించి మరో విషయం వెలుగులోకి వచ్చింది. తనను వ్యభిచార కూపంలోకి లాగేందుకు యత్నిస్తున్నారని వాట్సాప్‌లో స్నేహితుడితో ఆమె మొరపెట్టుకున్న స్క్రీన్ షాట్లు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

‘వారు నన్ను వేశ్యగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు’ అని అందులో పేర్కొంది. రూ.10వేలకు ‘ప్రత్యేక సేవలు’ చేయాలని రిసార్టు యజమాని ఒత్తిడి తెస్తున్నట్లు కూడా అందులో తెలిపింది. కాగా పోలీసులు సైతం ఈ మెసేజ్‌లపై స్పందించారు. ఆ స్క్రీన్ షాట్లలోని మెసేజ్‌లు సదరు యువతికి సంబంధించినవేనని.. దీనిపై మరింత స్పష్టత కోసం ఫోరెన్సిక్‌ పరీక్షలు అవసరమని పేర్కొన్నారు. సాయం చేయాలంటూ రిసార్టు ఉద్యోగితో మాట్లాడిన ఓ ఫోన్‌ కాల్‌ సైతం వైరల్‌గా మారింది. తన బ్యాగు తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టాలని ఉద్యోగిని అందులో అభ్యర్థించింది. అయితే, బ్యాగు తీసుకొని అక్కడికి వెళితే ఆమె కనిపించలేదని ఆ వ్యక్తి చెప్పినట్లు సమాచారం.

కాగా ఈ హత్యకు సంబంధించిన వివరాలను రాష్ట్ర డీజీపీ అశోక్‌ కుమార్ తాజాగా వెల్లడించారు. రిషికేశ్‌ దగ్గర్లో వనతారా రిసార్టుకు వచ్చే అతిథులకు అక్కడ రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తోన్న యువతి ‘ప్రత్యేక సేవలు’ అందించేందుకు నిరాకరించడం వల్లే వారు ఈ హత్యకు పాల్పడినట్లు తెలిపారు. ఆ యువతి తన ఫేస్‌బుక్‌ స్నేహితుడితో జరిపిన చాటింగ్ ఆధారంగా ఈ విషయం వెలుగులోకి వచ్చిందన్నారు. ఈ కేసులో భాజపా నేత వినోద్‌ ఆర్య కుమారుడు, రిసార్టు యజమాని పులకిత్‌ ఆర్య, అతడి సిబ్బందిని పోలీసులు ఇప్పటికే  అరెస్టు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని