Alert: ఎడ్యుటెక్‌ కంపెనీల పట్ల జాగ్రత్త!

దిల్లీ: ఎడ్యుకేషన్‌ టెక్నాలజీ (ఎడ్యుటెక్‌) సంస్థలు ఆన్‌లైన్‌ ద్వారా అందించే శిక్షణ, కంటెంట్‌ పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర విద్యాశాఖ హెచ్చరించింది

Published : 24 Dec 2021 15:20 IST

అవి ఆన్‌లైన్‌ ఉచ్చులు కావొచ్చు

విద్యార్థులు, తల్లిదండ్రులకు కేంద్ర విద్యాశాఖ హెచ్చరిక

ఈనాడు, దిల్లీ: ఎడ్యుకేషన్‌ టెక్నాలజీ (ఎడ్యుటెక్‌) సంస్థలు ఆన్‌లైన్‌ ద్వారా అందించే శిక్షణ, కంటెంట్‌ పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర విద్యాశాఖ హెచ్చరించింది. ఈ విషయంలో స్పందించాల్సిన తీరుపై కొన్ని సూచనలు జారీచేసింది.

1. సబ్‌స్క్రిప్షన్‌ రుసుము కింద ఆటోమేటెక్‌ డెబిట్‌ ఆప్షన్‌ ఇవ్వకూడదు. కొన్ని విద్యా సంస్థలు ప్రీమియం బిజినెస్‌ మోడల్‌ కింద మొదట తమ సర్వీసులను ఉచితంగా అందిస్తాయి. తర్వాత ఆ సేవలను కొనసాగించడానికి చెల్లింపులు తప్పనిసరి చేస్తాయి. విద్యార్థులు ఆటో డెబిట్‌ను యాక్టివేట్‌ చేసినప్పుడు వారికి తెలియకుండానే డబ్బులు ఖాతా నుంచి వెళ్లిపోతాయి.

2. ఏదైనా సంస్థతో ఒప్పందం చేసుకునేముందు... వారు చెప్పిన విధివిధానాలు, షరతులన్నీ జాగ్రత్తగా చదవాలి. లెర్నింగ్‌ సాఫ్ట్‌వేర్‌ను మీరు ఉపయోగించే డివైజ్‌ ద్వారా ఆమోదించినప్పుడు వ్యక్తిగత డేటాను ట్రాక్‌ చేసే ప్రమాదముంది.

3. కంటెంట్‌ లోడ్‌చేసిన కంప్యూటర్‌ పరికరాలు, యాప్‌లు, పెన్‌డ్రైవ్‌లను కొనుగోలు చేసినప్పుడు ట్యాక్స్‌ ఇన్వాయిస్‌ స్టేట్‌మెంట్‌ను అడగాలి.

4. ఏదైనా ఎడ్‌టెక్‌ కంపెనీని సబ్‌స్క్రైబ్‌ చేసేముందు దాని పూర్వాపరాలను పూర్తిగా తనిఖీ చేసుకోవాలి.

5. ఆ సంస్థలు అందించే కంటెంట్‌నూ పరీక్షించి చూసుకోవాలి. అందులోని విషయాలు సిలబస్‌కు అనుగుణంగా ఉన్నాయా? విద్యార్థులు పూర్తిగా అర్థం చేసుకోగలరా? అన్నది పరిశీలించాలి.

6. డబ్బు చెల్లించడానికి ముందే ఆన్‌లైన్‌ పోర్టళ్లు అందించే కంటెంట్‌కు సంబంధించిన అనుమానాలన్నింటినీ నివృత్తి చేసుకోవాలి.

7. పిల్లలు వినియోగించే కంప్యూటర్‌ పరికరాలపై తల్లిదండ్రులకు నియంత్రణ ఉండేలా చూసుకోవాలి.

8. చదువుకు సంబంధించిన యాప్‌లు పిల్లల్లో ఖర్చును ప్రోత్సహించేలా ఉంటాయి. ఈ విషయాన్ని తల్లిదండ్రులు తమ పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి.

9. ఆన్‌లైన్‌ ఎడ్యుటెక్‌ కంపెనీల గురించి అంతర్జాలంలో ఉండే సమీక్షలను, ఇతరుల అభిప్రాయాలను చదవాలి. తల్లిదండ్రులు, విద్యార్థులు వారి అభిప్రాయాలను కూడా ఆన్‌లైన్‌లో పొందుపరచాలి. తద్వారా అవి మిగతావారికి ఉపయోగకరంగా ఉంటాయి.

10. స్పామ్‌ కాల్స్‌ సాక్ష్యాలనూ; విద్యార్థులు, తల్లిదండ్రులు పూర్తిస్థాయి సమ్మతి తెలపకముందే బలవంతంగా సంతకాలు చేయించుకొనే ఎడ్యుకేషన్‌ ప్యాకేజీలకు సంబంధించిన ఆధారాలను రికార్డు చేసుకోండి.

ఎవర్నీ సులభంగా నమ్మొద్దు: 

1. ఎడ్యుటెక్‌ కంపెనీలు చేసే ప్రకటనలను సులభంగా నమ్మొద్దు.

2. అవగాహనలేని పత్రాలపై సంతకాలు చేయొద్దు.

3. వీడియోలు, ఫోటోలను షేర్‌ చేయొద్దు. వీడియో కాల్స్‌ సమయంలో వీడియోమోడ్‌లోకి వెళ్లే ముందు తగిన జాగ్రత్తలు తీసుకోండి. 

4. మీ ఈ-మెయిల్, కాంటాక్ట్‌ నంబరు, కార్డు వివరాలు, చిరునామాలను ఆన్‌లైన్‌లో ఉంచకండి. ఇలాంటి డేటాను మార్కెట్‌లో అమ్మేస్తారు. తర్వాత స్కాం దాడులు జరుగుతాయి.

5. ధ్రువీకరించుకోని కోర్సులను సబ్‌స్క్రైబ్‌ చేయొద్దు. 

6. ఎడ్‌టెక్‌ సంస్థలు ప్రచారంచేసే సక్సెస్‌ స్టోరీలను నమ్మొద్దు. ఎక్కువమందిని ఆకర్షించేందుకు ఎరగా వినియోగించే నిమిత్తం వాటిని రూపొందించి ఉండొచ్చు.

7. మార్కెటింగ్‌ సిబ్బందితో మీ బ్యాంకు ఖాతా, ఓటీపీ వివరాలను పంచుకోవద్దు. అవి సైబర్‌ మోసాలకు దారితీసే ప్రమాదముంది.

8. తెలియని సోర్స్‌ నుంచి కంప్యూటర్‌ తెరపై ప్రత్యక్షమయ్యే లింకుల్ని, అటాచ్‌మెంట్లను క్లిక్‌ చేయవద్దు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని