Rajkumar Roat: ప్రమాణస్వీకారానికి ఒంటెపై పార్లమెంట్‌కు.. అడ్డుకున్న సిబ్బంది

భారత్‌ ఆదివాసీ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ రాజ్‌కుమార్‌ రోత్‌ ప్రమాణస్వీకారానికి ఒంటెపై పార్లమెంట్‌కు వచ్చారు. అయితే, అధికారులు అడ్డుకోవడంతో ఆయన తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. 

Published : 25 Jun 2024 17:23 IST

దిల్లీ: ప్రమాణస్వీకార (Oath Taking ceremony) సమయంలో తమ ప్రాంత సంప్రదాయాలు, భాషకు పెద్దపీట వేసేందుకు చాలామంది నాయకులు ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలోనే పార్లమెంట్‌లో (Parliament) తెలుగు రాష్ట్రాల నుంచి తాజాగా ఎంపీలుగా ప్రమాణం చేసిన కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి (Kihan Reddy), బండి సంజయ్‌ (Bandi Sanjay), రామ్మోహన్‌ నాయుడు తెలుగుదనం ఉట్టిపడే వస్త్రధారణతో అచ్చ తెలుగులో ప్రమాణం చేశారు. విజయనగరం పార్లమెంట్ సభ్యుడు కలిశెట్టి అప్పలనాయుడు దిల్లీలోని తన నివాసం నుంచి సైకిల్‌పై పార్లమెంట్‌కు వెళ్లి అందరి దృష్టినీ ఆకర్షించారు.

ఈ తరహాలోనే రాజస్థాన్‌కు చెందిన భారత్‌ ఆదివాసీ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ రాజ్‌కుమార్‌ రోత్‌ ప్రమాణస్వీకారానికి ఒంటెపై పార్లమెంట్‌కు వచ్చారు. అయితే, పార్లమెంట్‌ పరిసరాల్లోకి రాగానే ఆయన్ని అక్కడున్న భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. ఒంటెను ఇంతకంటే ముందుకు అనుమతించడం కుదరదని చెప్పారు. సిబ్బంది తీరుపై ఎంపీ అసహనం వ్యక్తంచేశారు. గతంలో మూడుసార్లు ప్రధానిగా చేసిన వాజ్‌పేయీ ఎద్దుల బండిలో పార్లమెంట్‌కు వస్తే తప్పులేదు కానీ, నేను ఒంటెపై వస్తే తప్పేంటి? అని నిలదీశారు. దీనిపై పార్లమెంట్‌ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానన్నారు. కాంగ్రెస్‌ మద్దతుతో బాన్స్‌వారా లోక్‌సభ స్థానం నుంచి ఈయన విజయం సాధించారు. సోమవారం ప్రారంభమైన ప్రమాణస్వీకార కార్యక్రమం ఇవాళ్టితో ముగియనుంది. బుధవారం స్పీకర్‌ పదవి కోసం ఎన్నిక నిర్వహించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని