భారత్ బయోటెక్‌: ఆ వార్తలు అవాస్తవం!

కొవాగ్జిన్‌ మూడో దశ ప్రయోగాల సమాచారాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)కు సమర్పించిందని వస్తోన్న వార్తలపై భారత్‌ బయోటెక్‌ స్పష్టతనిచ్చింది.

Published : 18 Jun 2021 01:29 IST

WHOకు మూడోదశ ప్రయోగాల సమాచారంపై క్లారిటీ

దిల్లీ: కొవాగ్జిన్‌ మూడో దశ ప్రయోగాల సమాచారాన్ని భారత్‌ బయోటెక్‌ ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)కు సమర్పించిందని వస్తున్న వార్తలపై ఆ కంపెనీ స్పష్టతనిచ్చింది. అలాంటి వార్తలు నిజం కాదని.. వాటికి ఎటువంటి ఆధారాలు లేవని తెలిపింది. ఈ విషయాన్ని భారత్‌ బయోటెక్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. కొవాగ్జిన్‌ టీకా అనుమతుల ప్రక్రియలో భాగంగా ప్రపంచ ఆరోగ్య సంస్థతో ఈ నెల 23న ప్రీ-సబ్‌మిషన్‌ సమావేశం జరుగుతుందనే వార్తలు వెలువడ్డాయి. వీటిపై స్పందించిన భారత్‌ బయోటెక్‌ అవి నిరాధారమైన వార్తలుగా పేర్కొంది.

కొవాగ్జిన్‌ టీకాకు ఎమర్జెన్సీ యూజ్‌ లిస్టింగ్‌ కింద గుర్తింపు ఇవ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్థకు భారత్‌ బయోటెక్‌ దరఖాస్తు చేసుకుంది. ఇందుకు అవసరమైన పత్రాలను ఇప్పటికే సమర్పించింది. అయితే, కొవాగ్జిన్‌ టీకాకు అనుమతి ఇచ్చేందుకు భారత్‌ బయోటెక్‌ నుంచి ప్రపంచ ఆరోగ్య సంస్థ మరింత సమాచారాన్ని కోరింది. అంతేకాకుండా వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగం కోసం చేర్చే ప్రక్రియ పూర్తి రహస్యంగా సాగుతుందని WHO ఇదివరకే స్పష్టంచేసింది.

కొవాగ్జిన్‌ టీకా వినియోగానికి ఇప్పటివరకు 60కి పైగా దేశాల్లో అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నట్టు భారత్‌ బయోటెక్‌ వెల్లడించింది. ఆయా దేశాల్లో అనుమతి ప్రక్రియ పరిశీలనలో ఉండగా.. 13 దేశాల్లో ఇప్పటికే అత్యవసర వినియోగానికి అనుమతి లభించిందని స్పష్టం చేసింది. సెప్టెంబర్‌ లోపు డబ్ల్యూహెచ్‌వో అనుమతి వస్తుందని భావిస్తున్నామని భారత్‌ బయోటెక్‌ ఆశాభావం వ్యక్తం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని