Covaxin: సెప్టెంబర్‌లోపు WHO అనుమతి!

భారత్‌లో అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ టీకా వినియోగానికి ఇప్పటివరకు 60కిపైగా దేశాల్లో అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నట్టు భారత్‌ బయోటెక్‌ వెల్లడించింది.....

Published : 25 May 2021 21:31 IST

60 దేశాల్లో దరఖాస్తు..13 దేశాల్లో అనుమతి - భారత్‌ బయోటెక్‌

దిల్లీ: భారత్‌లో అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ టీకా వినియోగానికి ఇప్పటివరకు 60కిపైగా దేశాల్లో అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నట్టు భారత్‌ బయోటెక్‌ వెల్లడించింది. ఆయా దేశాల్లో అనుమతి ప్రక్రియ పరిశీలనలో ఉండగా.. 13 దేశాల్లో ఇప్పటికే అత్యవసర వినియోగానికి అనుమతి లభించిందని స్పష్టం చేసింది. సెప్టెంబర్‌ లోపు డబ్ల్యూహెచ్‌వో అనుమతి వస్తుందని భావిస్తున్నామని భారత్‌ బయోటెక్‌ ఆశాభావం వ్యక్తం చేసింది.

కొవాగ్జిన్‌ టీకాకు ఎమర్జెన్సీ యూస్‌ లిస్టింగ్‌ కింద గుర్తింపు ఇవ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్థకు భారత్‌ బయోటెక్‌ దరఖాస్తు చేసుకుంది. ఇందుకు అవసరమైన పత్రాలను ఇప్పటికే సమర్పించింది. అయితే, కొవాగ్జిన్‌ టీకాకు అనుమతి ఇచ్చేందుకు భారత్‌ బయోటెక్‌ నుంచి మరింత సమాచారం కావాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగం కోసం చేర్చే ప్రక్రియ పూర్తి రహస్యంగా ఉంటుందని WHO స్పష్టంచేసింది. అత్యవసర వినియోగానికి అర్హత సాధించిన తర్వాత దాని ఫలితాలను విస్తృతంగా ప్రకటిస్తామని తెలిపింది.

అమెరికాలో దరఖాస్తు..

అమెరికాలో కొవాగ్జిన్‌ అత్యవసర వినియోగానికి భారత్‌ బయోటెక్‌ భాగస్వామ్య సంస్థ ఓక్యూజెన్‌ దరఖాస్తు చేసింది. వీటికి సంబంధించి అమెరికా ఆహార, ఔషధ సంస్థ (ఎఫ్‌డీఏ)కు మాస్టర్‌ ఫైల్‌ సమర్పించినట్లు ఓక్యూజెన్‌ వెల్లడించింది. అత్యవసర వినియోగ అధికారిక పత్రం ‘బయోలాజికల్‌ లైసెన్స్‌’ ఆమోదం కోసం చర్యలు చేపట్టినట్లు తెలిపింది. ప్రస్తుతం కొవాగ్జిన్‌ క్లినికల్‌, రెగ్యులేటరీ ప్రక్రియను మదింపు చేస్తున్నట్లు పేర్కొంది. అమెరికాలో కొవాగ్జిన్‌ ఉత్పత్తి, సరఫరా, వాణిజ్య వినియోగానికి సంబంధించి ఫిబ్రవరి నెలలో ఓక్యూజెన్‌తో భారత్‌ బయోటెక్‌ ఒప్పందం కుదుర్చుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని