బ్రెజిల్‌కు ‘కొవాగ్జిన్‌’ టీకా!

కొవాగ్జిన్‌ టీకాను సరఫరా చేసేందుకు అక్కడి మెడికల్‌ ఏజెన్సీ ప్రెసిసా మెడికామెంటోస్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు భారత్‌ బయోటెక్‌ వెల్లడించింది.

Published : 12 Jan 2021 21:13 IST

భారత్‌ బయోటెక్‌తో ఒప్పందం

దిల్లీ: కరోనా విజృంభణతో విలవిలలాడుతోన్న బ్రెజిల్‌ వ్యాక్సిన్‌ కోసం భారత్‌ సంస్థలను సంప్రదిస్తోంది. తాజాగా భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ టీకాను తీసుకునేందుకు ముందుకొచ్చింది. ఇందులో భాగంగా, కొవాగ్జిన్‌ టీకాను సరఫరా చేసేందుకు అక్కడి మెడికల్‌ ఏజెన్సీ ప్రెసిసా మెడికామెంటోస్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు భారత్‌ బయోటెక్‌ వెల్లడించింది.

వ్యాక్సిన్‌ వివరాలు, సరఫరా సాధ్యాసాధ్యాలపై ఈ నెల 7, 8 తేదీల్లో ప్రెసిసా ప్రతినిధులు హైదరాబాద్‌లోని కేంద్రాన్ని సందర్శించినట్లు భారత్‌ బయోటెక్‌ సీఎండీ డాక్టర్‌ కృష్ణ ఎల్ల తెలిపారు. ఇప్పటికే కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ పూర్తి సురక్షితమని తేలడంతో పాటు రోగనిరోధకతలోనూ మంచి పనితీరు కల్పిస్తుందనే విషయం రుజువయ్యిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బ్రెజిల్‌ ప్రజల ఆరోగ్య అవసరాలకు భారత్‌లో అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌లు ఉపయోగపడుతున్నాయని డాక్టర్‌ కృష్ణ ఎల్ల సంతోషం వ్యక్తం చేశారు.

ఇక, వ్యాక్సిన్‌ పనితీరులో భారత్‌ బయోటెక్‌ తయారుచేసిన టీకా తమ అంచనాలను మించి ఉందని బ్రెజిల్‌ ఫార్మా సంస్థ డెరెక్టర్‌ ఎమాన్యూయేల్‌ మెడ్రాడెస్‌ స్పష్టంచేశారు. అంతేకాకుండా భారత్‌ బయోటెక్‌తో చేసుకున్న ఈ ఒప్పందం ఎంతగానో దోహదపడుతుందన్నారు. అయితే, బ్రెజిల్‌లో ప్రైవేటు సంస్థలు కూడా వ్యాక్సిన్‌ పంపిణీ కోసం ప్రయత్నిస్తున్నాయి. అలాంటి వారు బ్రెజిల్‌ నియంత్రణ సంస్థ ‘అన్విసా’తో అనుమతి పొందాల్సి ఉంటుంది.

ఇదిలాఉంటే, భారత్‌లో అనుమతి పొందిన కొవాగ్జిన్‌ టీకాను అత్యవసర వినియోగం కింద జనవరి 16 నుంచి పంపీణీ చేసేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. దీనితోపాటు ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా అభివృద్ధిచేసిన కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ పంపిణీని ఇక్కడి సీరం ఇన్‌స్టిట్యూట్‌ సరఫరా చేస్తోంది.

ఇవీ చదవండి..
రెండు టీకాలు సురక్షితమైనవే..!
కొత్తరకంపై ‘కొవాగ్జిన్‌’ పనిచేస్తుంది

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని