Bharat Jodo Yatra: జోడో యాత్రపై కశ్మీర్‌ ప్రముఖుల మౌనమేల?

రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్రకు విశేష స్పందన వస్తున్నప్పటికీ టీవీ ఛానెళ్ల నుంచి, స్థానిక ప్రముఖుల నుంచి మద్దతు కరవవుతోందని ఎన్సీపీ నేత ఒమర్‌ అబ్దుల్లా తెలిపారు. మరోవైపు యాత్ర  కశ్మీర్‌లో ప్రవేశించిన తర్వాత స్వేచ్ఛా వాయువులు పీల్చినట్లుందని పీడీపీ అధ్యక్షురాలు మెహబూబూ ముఫ్తీ అన్నారు.

Updated : 28 Jan 2023 18:04 IST

శ్రీనగర్‌: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేపట్టిన భారత్‌ జోడో యాత్ర (Bharat Jodo Yatra)కు కశ్మీర్‌లో విశేష స్పందన లభిస్తోందని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ (NCP) కీలక నేత ఒమర్‌ అబ్దుల్లా (Omar abdullah) అన్నారు. అయితే, స్థానిక ఛానెళ్లు, కశ్మీర్‌ ప్రముఖులు దీనిపై మౌనంగా ఉండటంపై ఆయన పెదవి విరిచారు. ‘‘ జోడో యాత్రపై మాట్లాడాల్సిన వాళ్లు మౌనంగా ఉంటున్నారు. టీవీ ఛానెళ్లు కూడా పెద్దగా కవరేజీ ఇవ్వడం లేదు’’ అని అన్నారు. కశ్మీరీ ప్రజల నుంచి రాహుల్‌ యాత్రకు అనూహ్య స్పందన వస్తోందన్న ఆయన.. చిన్నా పెద్దా, స్త్రీలు, పురుషులు అనే తేడా లేకుండా దేశ ఐక్యత కోసం రోడ్లపై ప్రజలు బారులు తీరుతున్నారని తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో పోస్టు చేశారు.

కాంగ్రెస్‌ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భారత్‌ జోడో యాత్ర కశ్మీర్‌లో ప్రవేశించడంతో స్వేచ్ఛా వాయువులు పీల్చినట్లనిపిస్తోందని పీపుల్‌ డెమొక్రటిక్‌ పార్టీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ పేర్కొన్నారు. 2019, ఆగస్టు 5న జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370ని రద్దు చేసిన తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకి రావడం ఇదే తొలిసారి అని ఆమె అన్నారు.  భారత్‌ జోడో యాత్ర ప్రస్తుతం కశ్మీర్‌లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.. దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లా సరిహద్దుకు చేరుకున్న రాహుల్‌ గాంధీకి స్వాగతం పలికిన ఆమె.. యాత్రలో భాగస్వాములయ్యారు. రాహుల్‌తో కలిసి యాత్రలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందంటూ ఆమె ట్వీట్‌ చేశారు.

భద్రతా కారణాలతో భారత జోడో యాత్రను రాహుల్‌ గాంధీ శుక్రవారం తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఇవాళ ఉదయం యాత్ర తిరిగి ప్రారంభమైంది. తనకు సరైన రక్షణ కల్పించక పోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాహుల్‌ గాంధీ చెప్పారు. జనాన్ని నియంత్రించే పోలీసులు ఎక్కడా కనిపించలేదని, దీంతో తన భద్రతా సిబ్బంది సూచన మేరకు యాత్ర నుంచి వైదొలిగానని తెలిపారు. జమ్ము ప్రాంతంలోని బనిహాల్‌ నుంచి జవహార్‌లాల్‌ సొరంగం గుండా..కాజీగుండ్‌లోకి ప్రవేశించిన రాహుల్‌.. 500 మీటర్లు నడిచిన తర్వాత యాత్రనుంచి విరమించుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని