Pro tem Speaker: లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా భర్తృహరి మహతాబ్‌

లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా ఒడిశాకు చెందిన సీనియర్‌ ఎంపీ భర్తృహరి మహతాబ్‌ వ్యవహరించనున్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయన్ని నియమించినట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు గురువారం వెల్లడించారు.

Published : 21 Jun 2024 05:58 IST

దిల్లీ: లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా ఒడిశాకు చెందిన సీనియర్‌ ఎంపీ భర్తృహరి మహతాబ్‌ వ్యవహరించనున్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయన్ని నియమించినట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు గురువారం వెల్లడించారు. సీనియర్‌ ఎంపీ మహతాబ్‌.. స్పీకర్‌ ఎన్నిక పూర్తయ్యే వరకు లోక్‌సభ ప్రిసైడింగ్‌ అధికారిగా కార్యకలాపాలు నిర్వహిస్తారని రిజిజు తెలిపారు. 18వ లోక్‌సభకు కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రొటెం స్పీకర్‌ ప్రమాణం చేయిస్తారని.. ఆయనకు కె.సురేష్‌ (కాంగ్రెస్‌), టీఆర్‌ బాలు (డీఎంకే), సుదీప్‌ బంధోపాధ్యాయ (టీఎంసీ)లతోపాటు భాజపాకు చెందిన రాధామోహన్‌ సింగ్, ఫగన్‌ సింగ్‌ కులస్తేలతో కూడిన ఛైర్‌పర్సన్ల ప్యానెల్‌ సహాయంగా ఉంటుందని మంత్రి తెలిపారు. మహతాబ్‌ ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికలకు ముందే బిజూ జనతాదళ్‌ను వీడి భాజపాలో చేరి.. కటక్‌ నుంచి విజయం సాధించారు. 18వ లోక్‌సభ సమావేశాలు జూన్‌ 24 నుంచి ప్రారంభం కానున్నాయి. 24, 25 తేదీల్లో కొత్త సభ్యుల ప్రమాణస్వీకారం జరగనుంది. 26న స్పీకర్‌ను ఎన్నుకోనున్నారు. మరోవైపు ప్రొటెం స్పీకర్‌ ఎంపికలో కేంద్రం పార్లమెంటరీ సంప్రదాయాన్ని పాటించలేదని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించింది. ఎనిమిదిసార్లు ఎంపీగా ఎన్నికైన కాంగ్రెస్‌ నేత కొడికున్నిల్‌ సురేష్‌ను కాదని ఏడుసార్లు ఎంపీగా ఎన్నికైన మహతాబ్‌ను ఎంపికచేయడంద్వారా కేంద్రం పక్షపాత వైఖరిని అవలంబించిందని ఆ పార్టీ సీనియర్‌ నాయకులు విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని