Bhole Baba: భోలే బాబా ఆశ్రమం.. మహిళా భక్తులకే ప్రవేశం!

రాజస్థాన్‌లోని భోలే బాబా ఆశ్రమంలోకి కేవలం మహిళా భక్తులకే ప్రవేశం ఉంటుందని సహజపూర్‌ గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

Published : 10 Jul 2024 00:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రస్‌ (Hathras)లో భోలే బాబా(Bhole Baba) సత్సంగ్‌ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాట (stampede)లో 121 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భోలే బాబాకు సంబంధించి విస్తుపోయే విషయాలు బయటకొస్తున్నాయి. తాజాగా రాజస్థాన్‌ (Rajasthan)లోని ఆయన ఆశ్రమం గురించి పలు వివాదాస్పద అంశాలు వెలుగు చూశాయి. 

ఆధునిక హంగులు.. అపారమైన సౌకర్యాలు

రాజస్థాన్‌లోని ఖేడ్లీ (Khedli) పట్టణానికి సమీపంలోని సహజపూర్‌ గ్రామ శివారులో భోలే బాబా అలియాస్‌ నారాయణ్‌ సాకర్‌ హరికి విలాసవంతమైన ఆశ్రమం ఉంది. సుమారు 40వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. లోపలి విషయాలు బయటకు తెలియకుండా ఆశ్రమం చుట్టూ ఎత్తైన ప్రహరీ గోడలు నిర్మించారు. ఇదిలా ఉండగా ఆశ్రమం ఆధునిక హంగులు, విలాసవంతమైన గదులతో నిండి ఉంటుందని అక్కడి గ్రామస్థులు చెబుతున్నారు.   

ముందస్తు అనుమతి తప్పనిసరి...

ముందస్తు అనుమతి లేకుండా స్థానిక గ్రామస్థులతో సహా ఎవరినీ లోపలికి అనుమతించరట. ముఖ్యంగా భోలే బాబా ఆశ్రమంలో ఉన్న సమయంలో కేవలం మహిళా భక్తులకు మాత్రమే ప్రవేశం ఉంటుందని, పురుష భక్తులకు, స్థానికులకు ప్రవేశం ఉండదని ఆ ఊరి ప్రజలు చెబుతున్నారు. స్థానికులు కాదని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తే బాబా అనుచరులు దాడులు చేసేవారని వాపోయారు. ఈ దాడులను ఆశ్రమ వాసులు బాబా దీవెనలుగా సమర్థించుకునేవారని తెలిపారు.

మాకు నమ్మకం లేదు..కానీ,

పదేళ్ల క్రితం ఆశ్రమం కోసం గ్రామస్థుల భూమిని భోలే బాబా కొనుగోలు చేశారని స్థానిక పంచాయితీ వార్డు మెంబరు పూల్‌ సింగ్‌ యాదవ్‌(Phool Singh Yadav) పేర్కొన్నారు. బాబా ఉపన్యాసాలు, దీవెనల కోసం వెళ్లినప్పుడు ఆశ్రమవాసులు దాడులకు తెగబడేవారని వెల్లడించారు. బాబా అద్భుతాలు, అతీత శక్తుల గురించి ఆశ్రమ వాసులు చెప్పే మాటలను గ్రామస్థులెవరూ విశ్వసించేవారు కాదన్నారు. అయినప్పటికీ సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు భోలే బాబాను దేవుడిగా కొలుస్తున్నారని చెప్పుకొచ్చారు.       

         

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు