Hathras Stampede: 24 ఆశ్రమాలు, లగ్జరీ కార్లు.. భోలే బాబాకు ₹100 కోట్ల ఆస్తులు!

Hathras Stampede: భోలే బాబా నిర్వహించిన సత్సంగ్‌కు హాజరై అనంతరం తొక్కిసలాటలో మరణించిన ఘటనలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భోలే బాబాకు దాదాపు రూ.100 కోట్ల వరకు ఆస్తులు ఉన్నట్లు సమాచారం.

Updated : 05 Jul 2024 18:19 IST

హాథ్రస్‌: ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్రస్‌ జిల్లాలో జరిగిన తొక్కిసలాటకు (Hathras Stampede) కేంద్ర బిందువుగా మారిన భోలే బాబా (Bhole Baba) ఆచూకీ ఇప్పటి వరకు లభించలేదు. 121 మంది మృతికి కారణమైన ఈ ఘటనలో ఇప్పటి వరకు ఆరుగురిని అరెస్టు చేశారు. ఈ దుర్ఘటనపై జ్యుడిషియల్‌ విచారణ జరుపుతామని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ హామీ ఇచ్చారు.

ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న సూరజ్‌పాల్‌ అలియాస్‌ నారాయణ్‌ సాకార్‌ హరి అలియాస్‌ భోలే బాబా (Bhole Baba) దొరికితే ప్రశ్నిస్తామని అలీగఢ్‌ ఐజీ శాలభ్‌ మాథుర్‌ గురువారం తెలిపారు. కేసులో ఆయన్ని నిందితుడిగా చేర్చలేదని వెల్లడించారు. ఈ క్రమంలో భోలే బాబాకు సంబంధించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయన ఆస్తులు, విలాసాలపై ఓ జాతీయ మీడియా ఛానెల్ విస్తుపోయే నిజాలు వెల్లడించింది. ఆయన ఆశ్రమంలోని విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం సేకరించినట్లు వెల్లడించింది.

హాథ్రస్‌ తొక్కిసలాట ఘటన.. బాధితులను పరామర్శించిన రాహుల్‌ గాంధీ

భోలే బాబాకు (Bhole Baba) దేశవ్యాప్తంగా 24 ఆశ్రమాలు ఉన్నాయని సమాచారం. వీటిలో అత్యధికంగా యూపీలోనే ఉన్నాయి. ఆయన ఆస్తుల విలువ దాదాపు రూ.100 కోట్ల వరకు ఉంటుందని ఆశ్రమంలో విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. శ్రీ నారాయణ్‌ హరి సాకార్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ పేరిట వీటిని నిర్వహిస్తున్నారు. ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉండేవాళ్లే వీటి నిర్వహణ కార్యకలాపాలు చూస్తుంటారు. నిత్యం తెలుపు రంగు దుస్తులు, టై, కళ్లద్దాల్లో కనిపించే ఆయన అనుచరులకు దర్శనమిచ్చే సమయంలో భారీ పరేడ్‌తో వస్తారు. దాదాపు 16 మంది వ్యక్తిగత కమాండోలు ఆయన కారుకు ముందు 350 సీసీ బైక్‌లపై ప్రయాణిస్తూ దారిని క్లియర్‌ చేస్తారు. వెనక 15-30 కార్లతో ఆయన కాన్వాయ్‌ ఉంటుంది. దీంట్లో తెల్లటి టయోటా ఫార్చునర్‌ కారులో ఆయన ప్రయాణిస్తారు. కారు సీట్లతో సహా ఇంటీరియర్‌ సైతం పూర్తిగా తెలుపు రంగులో ఉంటుందని ఆయన అనుచరుల్లో కొంతమంది తెలిపారు.

సూరజ్‌పాల్‌ మెయిన్‌పురిలోని ఆశ్రమంలో నివాసముంటారు. హరి నగర్‌గా పిలిచే ఈ ఆశ్రమం 13 ఎకరాల్లో విస్తరించి ఉంది. భోలే బాబా (Bhole Baba), ఆయన భార్య కోసం అందులో దాదాపు ఆరు విలాసవంతమైన గదులు ఉంటాయని సమాచారం. ఆశ్రమంలోకి ప్రవేశిస్తుండగానే దానికి విరాళాలిచ్చిన 200 మంది పేర్లు కనిపిస్తాయని తెలుస్తోంది. వాటిపై రూ.10 వేల నుంచి రూ.2.5 లక్షల వరకు ఇచ్చిన దాతల వివరాలు ఉంటాయని సమాచారం. ఇటావాలో మరో కొత్త ఆశ్రమం నిర్మాణంలో ఉంది.

ఈ దుర్ఘటనలో బాధిత కుటుంబాలను కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ శుక్రవారం పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. దీన్ని రాజకీయం చేయడం తన ఉద్దేశం కాదని.. బాధితులకు భరోసా ఇవ్వడం కోసమే వచ్చినట్లు తెలిపారు. అయితే, సత్సంగ్‌ నిర్వహణలో అధికార యంత్రాంగంవైపు నుంచి లోపాలు ఉన్నట్లు తెలుస్తోందన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని