Bhutan: కరోనా కట్టడి.. రాజు చర్యలకు ప్రపంచం ఫిదా!

వైరస్‌ గురించి ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు, కట్టడి చర్యలను పరిశీలించేందుకు ఏకంగా భూటాన్‌ రాజు రంగంలోకి దిగారు.

Published : 26 Jun 2021 01:24 IST

పర్వత ప్రాంతాలకు కాలినడకన ప్రయాణం

మహమ్మారిపై అవగాహన, కట్టడి చర్యలపై సమీక్ష

థింపూ: కరోనా వైరస్‌ ధాటికి యావత్‌ ప్రపంచం వణికిపోతున్న విషయం తెలిసిందే. వైరస్‌ను కట్టడి చేయలేక చిన్నాపెద్ద తేడా లేకుండా పలుదేశాల ఆరోగ్య వ్యవస్థలు చేతులెత్తేస్తున్న పరిస్థితిని చూస్తున్నాం. ఈ నేపథ్యంలో మహమ్మారి పోరులో భూటాన్‌ ఆదర్శంగా నిలుస్తోంది. ముఖ్యంగా వైరస్‌ గురించి ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు, కట్టడి చర్యలను పరిశీలించేందుకు స్వయంగా భూటాన్‌ రాజు రంగంలోకి దిగారు. సంప్రదాయ దుస్తులను ధరించి ఓ సాధారణ వ్యక్తిలా బయలుదేరిన రాజు.. అవసరమైన చోట కాలినడకన కొండకోనల్లో ప్రయాణం సాగిస్తున్నారు. ఇలా అక్కడి ప్రభుత్వంతో పాటు ఏకంగా రాజే రంగంలోకి దిగి కరోనా మహమ్మారిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. దీంతో అక్కడ వైరస్‌ వ్యాప్తిని నియంత్రించడమే కాకుండా మరణాలు పెరగకుండా అరికట్టగలిగారు. ఇప్పటివరకు అక్కడ 2వేల పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. కేవలం ఒకే ఒక్క కొవిడ్‌ మరణం సంభవించింది.

కొండకోనల్లో పర్యటన..

కరోనాకు పుట్టినిల్లైన చైనా ఓ వైపు, కొవిడ్‌ విజృంభణతో వణికిపోతోన్న భారత్‌ మరోవైపు ఉండడంతో వైరస్‌ వ్యాప్తిపై భూటాన్‌ ఆందోళన చెందింది. అయినప్పటికీ సరిహద్దులపై ఆంక్షలు విధించి వైరస్‌ కట్టడికి నడుం బిగించింది. ఇందులో భాగంగా క్షేత్రస్థాయిలో పరిస్థితులను సమీక్షించేందుకు భూటాన్‌ రాజు జిగ్మే ఖేసర్‌ నంగ్యేల్‌ వాంగ్‌చుక్‌ నేరుగా రంగంలోకి దిగారు. మారుమూల ప్రాంతాలకు గుర్రాలు, కార్లలో వెళ్లారు. పర్వత ప్రాంతాల్లో ప్రతికూల పరిస్థితుల్లోనూ ట్రెక్కింగ్‌ చేసుకుంటూ ముందుకు సాగారు. ఇలా కరోనా వైరస్‌పై నేరుగా ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. వైరస్‌ వ్యాప్తి నియంత్రణకోసం తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. క్షేత్రస్థాయిలో ఉన్న ఆరోగ్య, కొవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ సిబ్బందికి పలు సూచనలు చేశారు. దాదాపు 4,343మీటర్ల ఎత్తైన పర్వత ప్రాంతాల్లో సేవలందిస్తోన్న ప్రాథమిక ఆరోగ్య సిబ్బందికి ధన్యవాదాలు తెలిపేందుకు ఏకంగా ఐదురోజుల పాటు నడక మార్గాన్ని కొనసాగించారు.

రాజు విన్నపంతో..

అడవిలో కార్చిచ్చు మాదిరిగా వైరస్‌ వ్యాపిస్తే దేశం మొత్తం సర్వనాశనం అవుతుందని రాజు ఆందోళన చెందినట్లు అంతఃపుర వర్గాలు వెల్లడించాయి. అందుకే కరోనా వైరస్‌ గురించి ప్రజల్లో అవగాహన కల్పించడానికి నేరుగా రాజు వాంగ్‌చుక్‌ మారుమూల ప్రాంతాలను పర్యటించారని ప్యాలెస్‌ అధికారులు వెల్లడించారు. పర్వతాలు, అటవీ ప్రాంతాల్లో కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తూ.. కొవిడ్‌ నిబంధనలు పాటించాలని రాజు ప్రజలను నేరుగా కోరారు. దాంతో ఈ విషయాన్ని ప్రజలు కూడా సీరియస్‌గా తీసుకున్నారని భూటాన్‌ ప్రధానమంత్రి తొటై షెరింగ్‌ పేర్కొన్నారు. అంతేకాకుండా రాజు పర్యటనతో కొవిడ్‌పై పోరులో తాము ఒంటరిగా లేమనే భావన ప్రజల్లో కలిగిందన్నారు.

ఒకే ఒక్క మరణం..

కొవిడ్‌పై పోరులో భాగంగా దేశవ్యాప్తంగా పర్యటన మొదలుపెట్టిన రాజు వాంగ్‌చుక్‌.. కొవిడ్‌ నిబంధనలను కచ్చితంగా పాటించారు. ప్రతి పర్యటన అనంతరం రాజధాని థింపూ చేరుకున్నాక క్వారంటైన్‌లోకి వెళ్లిపోయేవారు. ఇలా కొవిడ్‌ నియంత్రణ చర్యలను పర్యవేక్షించేందుకు అత్యంత ప్రమాదకరమైన సరిహద్దు ప్రాంతాలను కూడా పర్యటించినట్లు భూటాన్‌లోని ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రతినిధి రుయి పాలౌడే జీసస్‌ పేర్కొన్నారు. ఇలా గత 14 నెలలుగా కొవిడ్‌ కట్టడికి భూటాన్‌ రాజు తీసుకున్న చర్యలు వైరస్‌ వ్యాప్తిని నిలువరించడంలో స్పష్టంగా కనిపించాయి. దాదాపు 7లక్షల జనాభా కలిగిన భూటాన్‌లో ఇప్పటివరకు 2వేల పాజిటివ్‌ కేసులు నమోదుకాగా, కేవలం ఒకే ఒక్క కరోనా మరణం చోటుచేసుకుంది.

90 శాతం టీకా పంపిణీ పూర్తి

చిన్న దేశమైనప్పటికీ కొవిడ్‌ నియంత్రణ చర్యలను భూటాన్‌ పకడ్బందీగా అమలు చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్‌ విజృంభణ కొనసాగుతోన్న నేపథ్యంలో సరిహద్దులను మూసివేసింది. టెస్టుల సంఖ్యను పెంచడంతో పాటు వ్యాక్సిన్‌ పంపిణీ ప్రక్రియను వేగవంతం చేసింది. ఇప్పటికే అక్కడ అర్హత కలిగిన 90శాతం మంది లబ్ధిదారులకు ఆస్ట్రాజెనికా టీకా తొలి డోసును అందించింది. అయితే రెండో డోసు ఇచ్చే సమయంలో వ్యాక్సిన్‌ కొరత ఏర్పడింది. దీంతో మిశ్రమ వ్యాక్సిన్‌ విధానంలో వేరే టీకా అందించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

ఇదిలాఉంటే, ప్రశాంతతకు మారుపేరైన భూటాన్‌లో 2008 వరకు రాచరిక పాలన కొనసాగింది. అనంతరం రాజు తనకున్న అసాధారణ అధికారాలను వదులుకోవడంతో అప్పటినుంచి భూటాన్‌లో ప్రజాస్వామ్య పాలన మొదలయ్యింది. అయినప్పటికీ రాజవంశం మీదున్న గౌరవంతో సామాజిక-రాజకీయ అంశాల్లో రాజు కీలక భూమిక పోషించేందుకు అక్కడి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని