భూటాన్‌లో తొలి కరోనా మరణం..!

హిమాలయ ప్రాంతమైన భూటాన్‌ రాజ్యంలో తొలి కరోనా మరణం సంభవించింది.

Published : 08 Jan 2021 23:42 IST

కాఠ్‌మండూ: హిమాలయ ప్రాంతమైన భూటాన్‌ రాజ్యంలో తొలి కరోనా మరణం సంభవించింది. ఈ విషయాన్ని భూటాన్‌ ఆరోగ్యశాఖ అధికారికంగా ప్రకటించింది. రాజధాని థింపులో 34ఏళ్ల వ్యక్తి కరోనా వైరస్‌ వల్ల ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది. అయితే, ఇదివరకే కాలేయ వ్యాధితో బాధపడుతోన్న అతడికి కొవిడ్‌-19‌ సోకడంతో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచినట్లు భూటాన్‌ ఆరోగ్యవిభాగం తెలిపింది.

దాదాపు ఏడున్నర లక్షల జనాభా కలిగిన భూటాన్‌లో ఇప్పటివరకు 767 పాజిటివ్‌ కేసులు మాత్రమే బయటపడ్డాయి. మార్చి నెలలో అమెరికా నుంచి వచ్చిన పర్యాటకులలో ఒకరిలో ఈ వైరస్‌ను గుర్తించారు. ఇదే అక్కడి తొలి కరోనా. ఇప్పటికే అక్కడ రెండు సార్లు లాక్‌డౌన్‌ విధించారు. ముందుజాగ్రత్త చర్యగా విదేశీ పర్యాటకులపై ఆంక్షలు కొనసాగించారు. విదేశాల నుంచి వచ్చేవారిని తప్పనిసరి క్వారంటైన్‌లో ఉంచుతున్నారు. ఇప్పటివరకు భూటాన్‌లో 3 లక్షల కొవిడ్‌ టెస్టులు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. నిత్యం దాదాపు పదికిపైగా కేసులు బయటపడుతున్నాయి.

పది నెలలుగా విజృంభిస్తోన్న కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా 8కోట్ల మందిలో బయటపడింది. వీరిలో 19లక్షల మంది ప్రాణాలు కోల్పోయినట్లు అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. భారత్‌లోనూ కోటి మందికి వైరస్‌ సోకగా, లక్షా 50వేల మంది మృత్యువాతపడ్డారు. చైనాలో వైరస్‌ బయటపడిన నాటినుంచి ఇప్పటివరకు దాదాపు 210 దేశాలకు వ్యాపించింది. ఇప్పటివరకు కరోనా మరణాలు నమోదుకాని దేశాల్లో కాంబోడియా, గ్రెనాడా, డొమినికా, లావోస్‌ వంటి చిన్న ప్రాంతాలు మాత్రమే ఉన్నాయి. ఈ జాబితాలో ఇప్పటివరకు భూటాన్‌ నిలువగా, తాజాగా అక్కడ తొలి కరోనా మరణం చోటుచేసుకుంది.

ఇవీ చదవండి..
కరోనాపై తైవాన్‌ విజయం.. ఇలా
‘చైనా టీకా అత్యంత ప్రమాదకరం’

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని