Published : 05 Feb 2021 14:18 IST

H-1B.. ఈ ఏడాది లాటరీ విధానమే

వాషింగ్టన్‌: అమెరికాలో పనిచేసేందుకు వీలుగా భారతీయులు సహా ఇతర దేశాల ఉద్యోగ నిపుణులకు ఇచ్చే హెచ్‌-1బీ వీసాల ఎంపిక ప్రక్రియలో ట్రంప్‌ తీసుకొచ్చిన నూతన నిబంధనలను బైడెన్‌ ప్రభుత్వం కొంతకాలం వాయిదా వేసింది. ఈ ఏడాది డిసెంబరు 31 వరకు పాత పద్ధతి అయిన లాటరీ విధానాన్నే కొనసాగించనున్నట్లు ప్రకటించింది. కొత్త ఎంపిక ప్రక్రియకు అనుగుణంగా రిజిస్ట్రేషన్‌ వ్యవస్థలో మార్పులు చేయడం కోసం ఇమ్మిగ్రేషన్‌ ఏజెన్సీకి మరింత గడువు కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. 

హెచ్‌-1బీ వీసాల జారీలో సంప్రదాయ కంప్యూటరైజ్డ్‌ లాటరీ పద్ధతికి స్వస్తి పలుకుతూ గత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వీసాల ఎంపిక విధానంలో కీలక మార్పులు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. గరిష్ఠ వేతన స్థాయి, నైపుణ్యం ఆధారంగా వీసాలు ఇచ్చేలా కీలక సవరణ చేశారు. హెచ్‌-1బీ ఎంపికలో లాటరీ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ జనవరి 7న తుది ప్రకటన కూడా చేసింది. మార్చి 9 నుంచి కొత్త ఎంపిక విధానం అమల్లోకి రావాల్సి ఉంది. 

అయితే కొత్త విధానానికి అనుగుణంగా హెచ్‌-1బీ నమోదు వ్యవస్థ, ఎంపిక ప్రక్రియలో మార్పులు చేయాల్సి ఉన్నందున నూతన విధానాన్ని డిసెంబరు 31 వరకు వాయిదా వేస్తున్నట్లు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోంల్యాండ్‌ సెక్యూరిటీ ఓ ప్రకటనలో తెలిపింది. అప్పటివరకు పాత లాటరీ విధానాన్నే కొనసాగించనున్నట్లు వెల్లడించింది.

ఏంటీ కొత్త విధానం..

ఏటా హెచ్‌-1బీ వీసాల కోసం లక్షల సంఖ్యలో దరఖాస్తులు వస్తుంటాయి. వీటిలో కంప్యూటర్‌ ఆధారిత లాటరీ పద్ధతి ద్వారా 65వేల దరఖాస్తులను ఎంపిక చేసి వీసాలు జారీ చేస్తుంటారు. వీటితో పాటు సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, మ్యాథమెటిక్స్‌(STEM) విభాగాల్లో అమెరికా యూనివర్శిటీల్లో ఉన్నత విద్య పూర్తి చేసిన విదేశీ విద్యార్థులకు మరో 20వేల వీసాలు ఇస్తారు. అయితే ఈ విధానం ద్వారా అమెరికా కంపెనీలు చౌకగా లభించే విదేశీ ఉద్యోగులను తీసుకుంటుండంతో స్థానికులకు అవకాశాలు లభించడం లేదని భావించిన గత ట్రంప్‌ సర్కార్‌.. వీసాల జారీలో కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. లాటరీ పద్ధతిని రద్దు చేసి.. ప్రతిభ, గరిష్ఠ వేతనం ఆధారంగా వీసాలు జారీ చేసేలా కీలక సవరణలు చేసింది. అంటే తొలుత అత్యధిక వేతనం పొందుతున్న ఉద్యోగులకు మొదటిగా వీసాలు మంజూరు చేస్తారు. అదే సమయంలో వారి స్థాయిని బట్టి, అత్యధిక నైపుణ్యం ఉన్న వారినీ పరిగణనలోకి తీసుకుంటారు.

కాగా.. హెచ్‌-1బీ సహా ఇతర వీసాల జారీని మార్చి 31 వరకు తాత్కాలికంగా నిషేధిస్తూ గత ట్రంప్‌ సర్కార్‌ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ నిషేధాన్ని ఎత్తివేస్తానని కొత్త అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రకటించారు. దీంతో ఏప్రిల్‌ 1 నుంచి వీసాల నమోదు ప్రక్రియ మొదలయ్యే అవకాశాలున్నాయి. హెచ్‌-1బీ వీసాల ద్వారా భారతీయ ఐటీ నిపుణులు అధిక ప్రయోజనం పొందుతున్న సంగతి తెలిసిందే. 

ఇవీ చదవండి..

బైడెన్‌ ప్రభుత్వం.. ఇక్కడ అన్నీ రిపేర్‌ చేస్తాం!

ట్రంప్‌ వలస విధానాలకు టాటా

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని