Imran Khan: అఫ్గాన్‌లో బలగాల ఉపసంహరణ.. బైడెన్‌కు పాక్‌ ప్రధాని మద్దతు

అఫ్గానిస్థాన్‌లో భద్రతా బలగాల ఉపసంహరణపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ మద్దతుగా నిలిచారు.....

Published : 20 Sep 2021 01:45 IST

దిల్లీ: అఫ్గానిస్థాన్‌లో అమెరికా భద్రతా బలగాల ఉపసంహరణపై అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ఆ దేశ అధ్యక్షుడు బైడెన్‌కు పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ మద్దతుగా నిలిచారు. బైడెన్ చేసిన పని సరైనదేనన్న ఇమ్రాన్.. అగ్రరాజ్య అధినేత అన్యాయమైన విమర్శలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. రష్యాకు చెందిన ‘ఆర్‌టీ’ న్యూస్‌ ఛానెల్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఇమ్రాన్‌ పలు అంశాలపై మాట్లాడారు. అఫ్గాన్‌కు అంతర్జాతీయ సహాయం నిలిచిపోయి, అక్కడ సంక్షోభం తలెత్తకుండా అమెరికా వ్యూహాలు రూపొందించాలని కోరారు.

అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా సైన్యాన్ని వెనక్కి రప్పించడంపై అమెరికా అధ్యక్షుడిని ఇమ్రాన్‌ ప్రశంసించారు. ‘అధ్యక్షుడు బైడెన్‌పై చాలా అన్యాయమైన విమర్శలు వస్తున్నాయి. కానీ ఆయన ఉత్తమమైన పని చేశారు’ అని పేర్కొన్నారు. ‘అఫ్గాన్‌లో అమెరికా దళాలు పనిచేయడానికి ఏకైక కారణం ఉగ్రవాదం అణచివేత కోసం. ఆ నేల మళ్లీ ఉగ్రవాదులకు అడ్డాగా మారి సంక్షోభం వైపు మళ్లకుండా చూడాల్సిన అవసరం ఉంది’ అని ఇమ్రాన్‌ చెప్పారు. ప్రస్తుతం సంక్షోభంలో ఉన్న అఫ్గాన్‌లో అమెరికా ఎలాంటి చర్యలు తీసుకోనుందో తనకు తెలియదని పేర్కొన్నారు.

అఫ్గాన్‌లో సమ్మిళిత ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అంశంపై తాలిబన్లతో తాను చర్చించినట్లు ఇమ్రాన్‌ పేర్కొన్నారు. తాలిబన్‌ ప్రభుత్వంపై తజిక్‌లు, హజారాలు, ఉజ్బెక్కులు ఉండేలా చూసుకోవాలని తాను సూచించినట్లు తెలిపారు. కొత్త సర్కారులో అన్ని జాతులు, మతాల రాజకీయ వర్గాల ప్రాతినిధ్యం ఉండాలని సూచించినట్లు వెల్లడించారు. అఫ్గాన్‌ శరణార్థుల విషయంలో సుదూర నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని