Updated : 24 May 2022 14:00 IST

Biden: భారత్‌పై బైడెన్‌ ప్రశంసలు.. కొవిడ్‌ను ఎదుర్కోవడంలో చైనా విఫలమైందని వ్యాఖ్య..!

టోక్యో: క్వాడ్ సమావేశంలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మంగళవారం టోక్యోలో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను అత్యంత సన్నిహితంగా మార్చేందుకు అమెరికా కట్టుబడి ఉందని ఈ సందర్భంగా జో బైడెన్‌  వెల్లడించారు. కొవిడ్‌ను ఎదుర్కొనే విషయంలో భారత్‌, చైనా మధ్య పోలిక తెచ్చి.. డ్రాగన్‌ను విమర్శించారు.

‘ఉక్రెయిన్-రష్యా యుద్ధం, దాని ప్రభావాల గురించి మేం చర్చించాం. ప్రపంచ దేశాలపై పడిన ఈ ప్రతికూల ప్రభావాలను తగ్గించేదిశగా మేం చర్చలు కొనసాగించనున్నాం. భారత్, అమెరికా కలిసి చేయగలిగింది చాలా ఉంది. రెండు దేశాల మధ్య సంబంధాన్ని అంత్యంత సన్నిహితంగా మార్చేందుకు కట్టుబడి ఉన్నాం’ అని బైడెన్ అన్నారు. ఈ క్రమంలో మోదీ మాట్లాడుతూ.. రెండు దేశాలది నమ్మకమైన భాగస్వామ్యమని వెల్లడించారు. పరస్పర ప్రయోజనాలు ఈ బంధాన్ని మరింత బలోపేతం చేస్తాయని వ్యాఖ్యానించారు. అయితే ఇరు దేశాల మధ్య వాణిజ్య, పెట్టుబడి అవకాశాలు ఆశించిన మేర పెరగడం లేదంటూ ఈ సందర్భంగా లేవనెత్తారు.

భారత్‌ విజయం.. ప్రజాస్వామ్య విజయం

ఈ ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా అజెండాలో లేని విషయాన్ని బైడెన్ ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ప్రజాస్వామ్య వ్యవస్థల ప్రాముఖ్యతపై మాట్లాడారు. కొవిడ్‌ను ఎదుర్కోవడంలో భారత్‌ వంటి ప్రజాస్వామ్యం విజయం సాధించిందన్నారు. సుదీర్ఘ ప్రజాస్వామ్య ప్రక్రియల వల్ల నిర్ణయాలు ఆలస్యం అవుతాయనే అభిప్రాయాన్ని, చైనా, రష్యా వంటి నిరంకుశ దేశాలు మారుతున్న ప్రపంచాన్ని మెరుగ్గా నిర్వహించగలవనే అపోహను ఈ విజయం తోసిపుచ్చిందని వ్యాఖ్యానించారు. 

క్వాడ్ పరిధి విస్తరించింది: మోదీ

దీనికి ముందు ప్రధాని మాట్లాడుతూ.. అతి తక్కువ సమయంలోనే క్వాడ్‌కూటమి ప్రపంచంలోనే ముఖ్యమైన స్థానాన్ని సంపాదించిందన్నారు. ‘క్వాడ్ పరిధి విస్తరించింది. క్వాడ్ స్వరూపం ప్రభావవంతంగా మారింది. మన మధ్య పరస్పర విశ్వాసం, సంకల్పం..ప్రజాస్వామ్య శక్తులకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. స్వేచ్ఛాయుత, సమ్మిళిత ఇండో పసిఫిక్ నిర్మాణానికి ప్రోత్సాహం అందిస్తుంది. ఇండో పసిఫిక్ కోసం క్వాడ్ ఒక నిర్మాణాత్మక అజెండాతో పనిచేస్తోంది’ అని క్వాడ్ ప్రాధాన్యతను వివరించారు. 

ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో పరస్పర సహకారాన్ని మరింతగా పెంపొందించుకునే లక్ష్యంతో క్వాడ్ కూటమి ఏర్పడింది. భారత్‌, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌ ఈ కూటమి దేశాలు. 

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని