Circle Around Sun: సూర్యుడి చుట్టూ వృత్తం.. ఎలాగంటే!

ఆకాశంలో అత్యంత అరుదుగా కనిపించే వృత్తాకార వలయాలు, ఇంద్రధనస్సు వంటి దృగ్విషయాలు ఆశ్చర్యానికి గురిచేస్తాయి.

Updated : 02 Jun 2021 15:41 IST

 కనువిందు చేస్తున్న 22 డిగ్రీ వృత్తాకార వలయాలు

దిల్లీ: అంతరిక్షంలో ఆశ్చర్యాలకు గురిచేసే అద్భుతాలు నిత్యం ఎక్కడో చోట కనిపిస్తూనే ఉంటాయి. ఇలా ఆకాశంలో అత్యంత అరుదుగా కనిపించే వృత్తాకార వలయాలు, ఇంద్రధనస్సు వంటి దృగ్విషయాలు ఆశ్చర్యానికి గురిచేస్తాయి. తాజాగా తెలంగాణలోనూ పలుచోట్ల సూర్యుడి చుట్టూ ఇంద్రధనస్సు మాదిరి వలయాలను ప్రజలు ఆసక్తిగా గమనించారు. అయితే, ఇటువంటి వలయాలు సాధారణమైనవేనని.. వీటిని 22డిగ్రీ వృత్తాకార వలయాలుగా పేర్కొంటారని ఖగోళ శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

ఏమిటీ వలయం..?

సూర్యుడు చుట్టూ ఇంద్రధనస్సు మాదిరి వలయం కనిపించడం సాధరణ ప్రక్రియే. వాతావరణంలో ఉండే నీటిబిందువుల నుంచి కాంతి ప్రయాణించినప్పుడు కాంతి విక్షేపణం (Scattering) చెందడం వల్ల ఇంద్రధనస్సు ఏర్పడుతుంది. ఇదే మాదిరిగా ఒక్కోసారి సూర్యుడి చుట్టూ వృత్తాకార వలయాలు ఏర్పడుతాయి. భూమిపై ఏదైనా ప్రదేశం నుంచి సూర్యున్ని వీక్షిస్తున్నప్పుడు అక్కడ ఏర్పడిన వృత్తం వ్యాసార్థం 22 డిగ్రీలుగా ఉంటుంది. అందుకే ఈ వృత్తం ఏర్పడే ప్రక్రియను ‘22 డిగ్రీ వృత్తం’ అని పిలుస్తుంటారు. సముద్రమట్టానికి 20వేల అడుగుల ఎత్తులోనూ లక్షల కొద్ది అతి చిన్న మంచు స్ఫటికాల రూపంలో ఉండే తేలికగా మేఘాలు (సిర్రస్‌ క్లౌడ్స్‌) ఉంటాయనడానికి సంకేతంగా ఇలాంటి వృత్తాలు నిదర్శనమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

షట్కోణ ఆకారంలో ఉండే నీటి బిందువుల ద్వారా కాంతి ప్రయాణించినప్పుడు అది వక్రీభవనం (కాంతి విభజన) తో పాటు పరావర్తనం చెంది మెరవడం వల్ల ఇలాంటి వృత్తాలు కనిపిస్తాయి. ఇంద్రధనస్సు ఏర్పడే మాదిరిగానే ఇవి సూర్యుడి చుట్టూ లేదా చంద్రుడి చుట్టూ ఏర్పడుతుంటాయి. స్థానిక వాతావరణ మార్పుల దృష్ట్యా ఒక్కో ప్రదేశంలో ఒక్కో సమయంలో ఇవి కనిపిస్తుంటాయి. సాధారణ సమయంలో మంచు పడుతున్న సమయంలోనూ ఇలాంటి వృత్తాలను మనం గమనిస్తూనే ఉంటాం’ అని ప్లానెటరీ సొసైటీ ఆఫ్‌ ఇండియా డైరెక్టర్‌ రఘునందన్‌ పేర్కొన్నారు. చంద్రుడి చుట్టూ కనిపించే ఇలా వృత్తాలను ‘మూన్‌ రింగ్‌’గా వ్యవహరిస్తారు. అయితే, ఇంద్రధనస్సులతో పోలిస్తే ఇవి ఎక్కువ రోజులు ఆకాశంలో కనిపిస్తూ కళ్లను కనువిందు చేస్తుంటాయని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.

ఇంద్రధనస్సు ఎలా ఏర్పడుతుంది..?

ప్రకృతిలోని సూర్యకాంతి అనేక లక్షల నీటిబిందువులతో విక్షేపణం (scattering) చెందడం వల్ల ఇంద్రధనస్సు ఏర్పడుతుంది. సూర్యుడి కాంతి నీటిబిందువులపై పడినప్పుడు ఈ తెల్లని కాంతి విక్షేపణం (scattering) చెంది ఎరుపురంగు తక్కువ విచలనాన్ని (Deviation), ఊదారంగు ఎక్కువ విచలనాన్ని (Deviation) పొందుతాయి. నీటి బిందువు రెండోవైపునకు చేరిన వివిధ రంగుల కాంతులు సంపూర్ణాంతర పరావర్తనం (Total Internal Reflection) వల్ల నీటి బిందువులోనే వెనుకకు పరావర్తనం చెందుతాయి. ఇలా నీటిబిందువులోకి ప్రవేశించే కిరణాలు, బయటకు వెళ్లే కిరణాల మధ్యకోణం 0 నుంచి 42 డిగ్రీల మధ్య ఎంతయినా ఉండవచ్చు. ఈ కిరణాల మధ్యకోణం 40 నుంచి 42డిగ్రీలు మధ్య ఉన్నప్పుడు ప్రకాశవంతమైన ఇంద్రధనస్సు ఏర్పడుతుంది. అయితే, ఇంద్రధనస్సు భూమిపై నుంచి చూసినప్పుడు అర్థవృత్తాకారంలో కనిపించినప్పటికీ.. విమానం నుంచి చూసినప్పుడు మాత్రం పూర్తి వృత్తంలా కనిపిస్తుంది.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని