Mamata Banerjee: రైల్వే నా బిడ్డవంటిది.. ఈ ప్రమాదం 21వ శతాబ్దపు అతి పెద్ద ఘటన

Odisha Train Tragedy: రైల్వే శాఖకు సంబంధించి ప్రభుత్వానికి సూచనలు చేయడానికి తాను సిద్ధమని పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. అలాగే ఇది రాజకీయాలు చేసే సమయం కాదని వ్యాఖ్యానించారు.

Updated : 03 Jun 2023 16:46 IST


బాలేశ్వర్‌: ఒడిశాలో జరిగిన భారీ రైలు ప్రమాదం.. 21వ శతాబ్దపు అతిపెద్ద ఘటన అని పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) పేర్కొన్నారు. అలాగే రైల్వే శాఖ తనకు బిడ్డతో సమానమని, దాని క్షేమం కోసం సూచనలు ఇవ్వడానికి సిద్ధమని తెలిపారు. ఇది రాజకీయాలు చేసే సమయం కాదని వ్యాఖ్యానించారు. (Odisha Train Tragedy )

‘నేను మూడుసార్లు రైల్వే మంత్రిగా పనిచేశాను. అప్పటి నుంచి నేను చూసిన వాటిలో 21వ శతాబ్దపు అతిపెద్ద ఘటన ఇది. ఇలాంటి కేసుల్ని రైల్వే సేఫ్టీ కమిషన్‌కు అప్పగించాలి. వారు విచారణ జరిపి, నివేదిక ఇస్తారు. అలాగే నాకు తెలిసినంత వరకు   కోరమాండల్‌లో యాంటీ కొలిజన్ డివైస్ లేదు. అదే ఉండిఉంటే.. ఈ స్థాయి ప్రమాదం జరిగేది కాదు.  చనిపోయిన వారిని వెనక్కి తీసుకురాలేం. కానీ సాధారణ పరిస్థితులు నెలకొనేలా తక్షణ చర్యలు తీసుకోవడమే ఇప్పుడు మనముందున్న కర్తవ్యం. రైల్వే శాఖ రూ.10 లక్షల పరిహారం ప్రకటించింది. అలాగే బెంగాల్‌కు చెందిన వారికి ప్రభుత్వం తరఫు నుంచి రూ.5 లక్షలు అందిస్తాం. సహాయక, పునరుద్ధరణ చర్యలు పూర్తయ్యే వరకు రైల్వే శాఖ, ఒడిశా ప్రభుత్వానికి సహకరిస్తాం. ప్రస్తుతం రైల్వేకు ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టడం లేదు. ఆ శాఖ నాకు బిడ్డతో సమానం. దానిలోని లోటుపాట్లను సరిదిద్దేందుకు సూచనలు ఇవ్వడానికి నేను సిద్ధం’అని మమత అన్నారు.

ఈ రోజు ఉదయం ఘటనాస్థలానికి చేరుకున్న ఆమె రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇది రాజకీయాలు చేయడానికి సమయం కాదని వ్యాఖ్యానించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని