KK pathak: నోరు పారేసుకున్న సీనియర్‌ ఐఏఎస్‌.. సర్వీసు నుంచి తొలగించాలని డిమాండ్‌

బిహార్‌లో కేకే పాఠక్‌ ( KK pathak) అనే సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి తోటి అధికారి పట్ల అనుచితంగా ప్రవర్తించారు. వ్యక్తిగత దూషణలు చేస్తూ అతడిని అవమానించారు. దీంతో అతడిని సర్వీసు నుంచి తొలగించాలని బిహార్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌ అసోసియేషన్‌ డిమాండ్‌ చేస్తోంది.

Published : 03 Feb 2023 00:06 IST

పట్నా: ఆయనో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి (IAS Officer). చాలా మంది అధికారులకు మార్గనిర్దేశం చేస్తూ.. పరిపాలన సక్రమంగా సాగేలా చూడాల్సిన బాధ్యతాయుత పదవిలో ఉన్నారు. అలాంటి వ్యక్తి ఓ జూనియర్‌ అధికారిపై అనుచితంగా ప్రవర్తించారు. కోపంతో ఊగిపోయి, వ్యక్తిగత దూషణలు చేశారు. బిహార్‌ (Bihar)లో అమలు చేస్తున్న ట్రాఫిక్‌ నిబంధనలపై జరిగిన సమీక్ష సమావేశంలో ఈ ఘటన జరిగింది. కోపంతో సీనియర్‌ అధికారి మీటింగ్‌ నుంచి లేచి వెళ్లిపోవడం విమర్శలకు తావిస్తోంది. తోటి అధికారిపై వ్యక్తిగత దూషణలు చేసిన అతడిని సర్వీసు నుంచి తొలగించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి కేకే పాఠక్‌ (KK pathak) బిహార్‌లోని ప్రొహిబిషన్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రిన్సిపల్‌ సెక్రెటరీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గురువారం రాష్ట్రంలో అమలు చేస్తున్న ట్రాఫిక్‌ నిబంధనలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ ప్రొబేషన్‌ ఐఏఎస్‌ అధికారిపై ఆయన నిప్పులు చెరిగారు.  డిప్యూటీ కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఆయన తోటి అధికారుల ఎదుటే  ‘సారీ’ చెప్పినా వినిపించుకోలేదు. వ్యక్తిగత దూషణలు చేస్తూ.. అర్ధంతరంగా సమీక్ష నుంచి వెళ్లిపోయారు. ‘ఇక్కడి ప్రజలు ఇలాగే ఉంటారు. చెన్నైలో చూడండి ప్రతి ఒక్కరూ కచ్చితంగా ట్రాఫిక్‌ రూల్స్‌ పాటిస్తారు. ఇక్కడ ఒక్కరైనా ట్రాఫిక్‌ నియమాలను పాటిస్తున్నారా?రెడ్‌లైట్‌ పడినప్పటికీ హారన్‌ మోగిస్తూనే ఉంటారు. మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారు?’’ అంటూ తోటి అధికారులపై మండిపడ్డారు.

అసలేం జరిగింది?

గత నవంబరులో గయలో.. ప్రొబేషన్‌ డిప్యూటీ కలెక్టర్‌ పట్ల అనుచితంగా ప్రవర్తించారనే కారణంతో పాఠక్‌ పై బిహార్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ (బీఐపీఏఆర్‌డీ) ఫిర్యాదు చేసింది. ఆ అధికారిని ఇప్పుడు సమీక్ష సమావేశంలో కలుసుకున్న పాఠక్‌..ఉద్దేశ పూర్వకంగా అతడిని నిందించాలనే ఇలా ప్రవర్తించినట్లు తోటి అధికారులు చెబుతున్నారు. సీనియర్‌ అధికారి ప్రవర్తనను బిహార్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌ అసోసియేషన్‌ (BASA) తప్పుబట్టింది. వ్యక్తిగతంగా దూషించిన అతడిని వెంటనే సర్వీసు నుంచి తొలగించాలని డిమాండ్‌ చేసింది. దీనిపై బిహార్‌ ఎక్సైజ్‌, రిజిస్ట్రేషన్‌ శాఖ మంత్రి స్పందించారు. సీనియర్‌ అధికారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామన్నారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని