
Jammu Kashmir: జమ్మూ- కశ్మీర్లో వలస కార్మికులకు రక్షణ కల్పించండి: నితీశ్ కుమార్
శ్రీనగర్: జమ్మూ- కశ్మీర్లో ఇటీవల వరుస ఉగ్ర దాడుల్లో బిహార్‌కు చెందిన పలువురు వలస కార్మికులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కశ్మీర్ లోయలో స్థానికేతరుల భద్రతకు భరోసా కల్పించాలని బిహార్ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం అక్కడి అధికార యంత్రాంగానికి విజ్ఞప్తి చేసింది. ఎక్కడెక్కడ స్థానికేతరులు నివసిస్తున్నారో ఆ ప్రాంతాలను గుర్తించాలని, అక్కడ పోలీసు బలగాలను మోహరించాలని కోరింది. వరుస ఘటనలపై విచారణకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. కశ్మీర్లో వరుస ఘటనలపై జమ్మూ- కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో మాట్లాడినట్లు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ వెల్లడించారు. పౌర హత్యలపై ఆందోళన వ్యక్తం చేసినట్లు చెప్పారు. బిహార్ డీజీపీ సైతం జమ్మూ-కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, చీఫ్ సెక్రెటరీతో ఈ విషయమై చర్చలు జరిపారు.
ఇటీవలి కాలంలో ఉగ్రవాదుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన పౌరుల సంఖ్య ఆదివారానికి 11కు చేరిన విషయం తెలిసిందే. ఇందులో నలుగురు బిహార్ కార్మికులు ఉన్నారు. ఈ నెల 5న జరిగిన ఉగ్ర దాడిలో బిహార్‌కు చెందిన విరంజన్ పాసవాన్ మృతి చెందారు. 16న శ్రీనగర్‌లో అర్వింద్ కుమార్‌ను, ఆదివారం కుల్గాంలోని వాన్పోహ్ ప్రాంతంలో రాజా రేషిదేవ్, జోగిందర్ దేవ్‌ను ఉగ్రవాదులు బలిగొన్నారు. రాజా కుటుంబానికి చెందిన చున్‌చున్ రేషిదేవ్ చికిత్స పొందుతున్నారు. మరోవైపు భద్రతా దళాలు స్థానికంగా ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లను ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో ఇటీవల చేపట్టిన తొమ్మిది ఎన్కౌంటర్లలో 13 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.