B.Tech Chaiwali: బీటెక్‌ చాయ్‌వాలీ.. చదువుకుంటూనే స్టార్టప్‌..!

వార్తికా సింగ్‌ది బిహార్‌. తన డిగ్రీ నిమిత్తం హరియాణాలోని ఫరీదాబాద్‌కు వచ్చింది. అక్కడ ఇంజినీరింగ్ విద్యను అభ్యసిస్తోంది. సొంతంగా వ్యాపారం చేయడమే ఆమె లక్ష్యం.

Updated : 14 Oct 2022 15:09 IST

ఫరీదాబాద్‌: లక్ష్యం ఏంటో పక్కాగా తెలిసినప్పుడు.. క్యాలెండర్ చూడడమెందుకు..? డిగ్రీల కోసం ఆగడమెందుకు..? అడుగు వేయాలనే సంకల్పం ఉంటే చాలు. ఈ మాటలను అక్షరాలా నిరూపిస్తోంది బిహార్‌కు చెందిన వార్తికా సింగ్‌. అందుకే చదువుతూనే తన కల వైపు మొదటి అడుగువేసింది. నెట్టింట్లో వైరల్‌గా మారిన వీడియో ఆమె ఏంటో తెలియజేస్తోంది.

వార్తికా సింగ్‌ది బిహార్‌. తన డిగ్రీ నిమిత్తం హరియాణాలోని ఫరీదాబాద్‌కు వచ్చింది. అక్కడ ఇంజినీరింగ్ విద్యను అభ్యసిస్తోంది. సొంతంగా వ్యాపారం చేయడమే ఆమె లక్ష్యం. కానీ తన డిగ్రీ చేతికి వచ్చేసరికి నాలుగు సంవత్సరాలు పడుతుంది. ‘నా బీటెక్ పూర్తయ్యే వరకూ వేచి ఉండటంలో అర్థం లేదు. అప్పటివరకు సమయం వృథా చేయడం సరికాదు’ అని ఆ వీడియోలో మాట్లాడింది. ఈ మాటలు ఆమెకు లక్ష్యం పట్ల ఉన్న స్పష్టతను తెలియజేస్తున్నాయి.

ఇక ఆలస్యం చేయకుండా ఆ దిశగా మొదటి అడుగు వేసింది. ఫరీదాబాద్‌లోని గ్రీన్‌ ఫీల్డ్ వద్ద టీ స్టాల్‌ను ఏర్పాటు చేసింది. దానికి ‘బీటెక్ చాయ్‌వాలీ’ అంటూ పేరుపెట్టుకుంది. తన లక్ష్యాన్ని ఎప్పుడూ గుర్తుచేసేలా ‘ఆత్మవిశ్వాసం, కృషి ఎప్పుడూ విజయాన్నే ఇస్తాయి’ అని స్టాల్‌ దగ్గర ఓ బ్యానర్‌నూ పెట్టుకుంది. తన కాలేజ్ పూర్తైన తర్వాత సాయంత్రం 5.30 గంటల నుంచి తొమ్మిది గంటలవరకు టీ విక్రయిస్తోంది. ఆమె దగ్గర లెమన్‌, మసాలా చాయ్ కూడా అందుబాటులో ఉన్నాయి. చివరగా ఈ వీడియోలో ఆమె ఒక అభ్యర్థన కూడా చేసింది. ‘ఈ వీడియోను షేర్ చేసి, వైరల్‌ చేయకండి. దాని వల్ల ఏమీ రాదు. ఇక్కడకు వచ్చి, ఒకసారి టీ తాగి చూడండి. నచ్చకపోతే మళ్లీ రావొద్దు’ అంటూ తన పనిలో నిమగ్నమైంది.

చిన్నవయస్సులో ఆమె చూపుతున్న పట్టుదలకు నెట్టింట్లో ప్రశంసలు దక్కుతున్నాయి. ‘మీ ఆత్మవిశ్వాసం మెప్పిస్తోంది’ అని ఒకరు రాసుకొచ్చారు. ‘ఇలాగే ముందుకు సాగండి. ఏడాదిలో మీరొక బ్రాండ్ అవుతారు’ అంటూ మరొకరు ప్రోత్సహించారు. ఇంతకుముందు బిహార్‌కు చెందిన ప్రియాంక గుప్తా కూడా ఇదే తరహాలో వెలుగులోకి వచ్చింది. కరోనా వేళ ఉన్న కొలువులే ఊడుతుంటే.. ఉద్యోగాల కోసం సమయం వృథా చేయడం సరికాదని ఆమె చాయ్‌వాలీ అవతారం ఎత్తిన సంగతి తెలిసిందే. తన ప్రయత్నంలో స్నేహితులు అండగా నిలిచారని ఆమె వెల్లడించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని