5 నిమిషాల్లోనే ఆమెకు కొవాగ్జిన్‌, కొవిషీల్డ్ డోసులు‌! 

వ్యాక్సినేషన్‌ ప్రక్రియ సందర్భంలో ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా లేకపోవడంతో పలుచోట్ల తప్పిదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా, బిహార్‌లోని అవాధ్‌పూర్‌ గ్రామానికి చెందిన ఓ మహిళకు ఐదు నిమిషాల వ్యవధిలోనే......

Published : 19 Jun 2021 01:12 IST

పట్నా: వ్యాక్సినేషన్‌ ప్రక్రియ సందర్భంలో ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా లేకపోవడంతో పలుచోట్ల తప్పిదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా బిహార్‌లోని అవాధ్‌పూర్‌ గ్రామానికి చెందిన ఓ మహిళకు ఐదు నిమిషాల వ్యవధిలోనే రెండు వేర్వేరు టీకాలు వేయడం కలకలం రేపింది. పట్నా నగర శివారులోని పున్‌పున్‌ పట్టణంలో ఓ పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్‌ సెంటర్‌ వద్ద బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది.

సునీలాదేవి అనే 65 ఏళ్ల వృద్ధురాలు టీకా వేయించుకొనేందుకు వెళ్లగా తొలుత కొవిషీల్డ్‌ తొలి డోసు వేసిన సిబ్బంది.. ఆ తర్వాత పొరపాటున ఐదు నిమిషాల వ్యవధిలోనే కొవాగ్జిన్‌ డోసు ఇవ్వడంతో ఆమెకు జ్వరం వచ్చింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, వైద్యబృందం పర్యవేక్షణలో ఉన్నట్టు వైద్యశాఖ అధికారులు తెలిపారు.

అసలేం జరిగిందంటే?
ఓ పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్‌ క్యాంపు వద్ద ఒకే గదిలో కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ టీకాల పంపిణీకి రెండు వేర్వేరు లైన్లు ఏర్పాటు చేశారు. 18 ఏళ్లు దాటిన, 45 ఏళ్లు పైబడిన వారికి ఒకే గదిలో టీకాలు వేస్తున్నారు. రిజిస్ట్రేషన్‌ను బయట చేస్తున్నారు. ఈ క్రమంలో బయట రిజిస్టర్‌ చేయించుకున్న అనంతరం ఆ వృద్ధురాలు మొదటి వరుసలో నిలబడి తొలుత కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ డోసు వేయించుకుంది. అయితే, వైద్య సిబ్బంది ఆమెను కాసేపు కూర్చోవాలని సూచించారు. దీంతో ఐదు నిమిషాల పాటు కూర్చున్నాక ఆమె రెండో వరుసలోకి వెళ్లి కొవాగ్జిన్‌ టీకా డోసు తీసుకున్నట్టు మెడికల్‌ ఆఫీసర్‌ సంజయ్‌ కుమార్‌ తెలిపారు. ఆమెకు ఈ ప్రక్రియ గురించి తెలియకపోవడం వల్లే పొరపాటు జరిగినట్టు గ్రామస్థులు చెబుతున్నారు. మరోవైపు ఇది తన తప్పిదం వల్లే జరిగిందని ఆ వృద్ధురాలి గ్రామానికి నియమించిన ఏఎన్ఎం అంగీకరించారు.

ఒకే రోజు కేవలం ఐదు నిమిషాల వ్యవధిలోనే రెండు డోసులు తీసుకున్న వృద్ధురాలికి జ్వరం రావడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కొందరు వ్యాక్సినేషన్‌ కేంద్రం వద్దకు చేరుకొని ఆరోగ్యశాఖ అధికారులను విషయం చెప్పారు. దీంతో అప్రమత్తమైన మెడికల్‌ ఆఫీసర్‌ ఓ బృందాన్ని ఏర్పాటు చేసి ఆమెను 24 గంటల పాటు పరిశీలనలో ఉంచాలని ఆదేశించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు తెలిపారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts