Tamil Nadu: బిహారీ కార్మికులపై దాడులంటూ ప్రచారం.. నీతీశ్‌కు స్టాలిన్‌ ఫోన్‌!

తమ రాష్ట్రంలో బిహారీ కార్మికులపై దాడులు జరిగాయంటూ సాగుతోన్న ప్రచారాన్ని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ కొట్టిపారేశారు. అవన్నీ ఉత్త పుకార్లేనని, స్థానికంగా ఉత్తరాది కార్మికులందరూ సురక్షితంగా ఉన్నారని వెల్లడించారు.

Published : 04 Mar 2023 23:01 IST

చెన్నై: తమిళనాడు(Tamil Nadu)లో ఉత్తరాది వలస కార్మికులు, ముఖ్యంగా బిహార్‌కు చెందిన వారి(Bihar Workers)పై దాడులు జరిగాయంటూ నెట్టింట పోస్టులు చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. అయితే.. ఇవన్నీ వదంతులేనని, తమ రాష్ట్రంలో వలస కార్మికులంద(Migrant Workers)రూ సురక్షితంగా ఉన్నారని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(MK Stalin) పేర్కొన్నారు. ఈ విషయమై బిహార్‌(Bihar) సీఎం నీతీశ్‌ కుమార్‌(Nitish Kumar)తోనూ ఫోన్‌లో మాట్లాడినట్లు శనివారం  ఆయన వెల్లడించారు. ఉత్తరాది రాష్ట్రాల కార్మికులు తమ రాష్ట్రంలో పని చేయడంపై ఎలాంటి భయాందోళనలు అవసరం లేదని హామీ ఇచ్చినట్లు చెప్పారు. పుకార్ల ద్వారా భయభ్రాంతులకు గురిచేసేవారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ మేరకు  ఓ ప్రకటన విడుదల చేశారు.

తమిళనాడులో ఇతర రాష్ట్రాల కార్మికులపై దాడులు జరుగుతున్నాయని పుకార్లు వ్యాప్తి చేయడం దేశ వ్యతిరేకమని, అవి జాతీయ సమగ్రతకు భంగం కలిగిస్తున్నాయని స్టాలిన్‌ అన్నారు. వేరే రాష్ట్రాల్లో జరిగిన కొన్ని ఘటనలను తమిళనాడులో జరిగాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని  ఆరోపించారు. ఇలాంటి చౌకబారు రాజకీయాలు చేయడాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో శాంతియుత వాతావరణాన్ని సహించలేని కొందరు.. ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావాలనే ఉద్దేశంతో తమిళుల సంస్కృతిని కించపరిచే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అయితే, వారి ప్రయత్నాలు విజయవంతం కావన్నారు. ఒకవేళ ఎవరైనా దాడుల వంటి ఘటనలకు యత్నిస్తే.. వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, తక్షణమే వారిపై చర్యలు తీసుకుంటామని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని