Marriage Age: లోక్‌సభ ముందుకు ‘యువతుల పెళ్లి వయసు పెంపు’ బిల్లు

దేశంలో యువతుల కనీస పెళ్లి వయసును 18ఏళ్ల నుంచి 21ఏళ్లకు పెంచే దిశగా బాల్య వివాహాల నియంత్రణ సవరణ బిల్లు - 2021ని కేంద్ర ప్రభుత్వం నేడు లోక్‌సభ ముందుకు తీసుకొచ్చింది.

Published : 21 Dec 2021 16:14 IST

ఆందోళనల మధ్యే బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రమంత్రి

దిల్లీ: దేశంలో యువతుల కనీస పెళ్లి వయసును 18ఏళ్ల నుంచి 21ఏళ్లకు పెంచే దిశగా బాల్య వివాహాల నియంత్రణ సవరణ బిల్లు - 2021ని కేంద్ర ప్రభుత్వం నేడు లోక్‌సభ ముందుకు తీసుకొచ్చింది. ఈ బిల్లుపై ప్రతిపక్షాలు తీవ్ర నిరసనలు వ్యక్తం చేసినప్పటికీ వారి ఆందోళనల నడుమే కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ బిల్లును ప్రవేశపెట్టారు. అయితే విపక్షాలు అభ్యంతరాలు చెప్పడంతో స్థాయీ సంఘానికి పంపిస్తున్నట్లు తెలిపారు. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘మన ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం. కానీ వివాహాబంధంలోకి అడుగుపెట్టే విషయంలో అమ్మాయిలు, అబ్బాయిలకు 75ఏళ్లు ఆలస్యంగా సమానహక్కులు కల్పిస్తున్నాం. ఈ సవరణతో ఇకపై యువతీయువకులు 21ఏళ్ల వయసులో పెళ్లిపై నిర్ణయం తీసుకునే అవకాశం లభిస్తుంది. మహిళా సమానత్వాన్ని దృష్టిలో ఉంచుకునే ఈ బిల్లును తీసుకొచ్చాం’’ అని తెలిపారు. 

అయితే ఈ బిల్లుపై విపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఎవరినీ సంప్రదించకుండా కేంద్రం ఏకపక్షంగా ఈ బిల్లు తీసుకొచ్చిందని కాంగ్రెస్‌ సహా ప్రతిపక్ష ఎంపీలు ఆరోపించారు. ఈ బిల్లును స్టాండింగ్‌ కమిటీ లేదా సెలెక్ట్‌ కమిటీకి పంపించాల్సిన అవసరం ఉందని, ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించిన తర్వాతే బిల్లును ప్రవేశపెట్టాలని డీఎంకే ఎంపీ కనిమొళి అన్నారు. 

మరోవైపు మజ్లిస్‌ సభ్యుడు అసదుద్దీన్‌ ఓవైసీ మాట్లాడుతూ ఈ బిల్లు .. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19 ప్రకారం యువతుల స్వేచ్ఛాయుత హక్కుకు వ్యతిరేకమని విమర్శించారు. 18ఏళ్ల అమ్మాయిలు ప్రధానమంత్రిని ఎన్నుకున్నప్పుడు, సహ జీవనం చేస్తున్నప్పుడు అదే వయసు యువతుల వివాహ హక్కును ఎందుకు తిరస్కరిస్తున్నారని ప్రశ్నించారు. విపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో బిల్లును పార్లమెంటరీ స్థాయీ సంఘానికి పంపిస్తామని కేంద్రం వెల్లడించింది. ఆ తర్వాత లఖింపుర్‌ ఖేరీ ఘటనతో పాటు పలు అంశాలపై ప్రతిపక్ష ఎంపీలు ఆందోళనకు దిగడంతో సభను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని