UN WFP: ‘ఆకలి అంచుల్లో 4.20 కోట్ల మంది.. ఎలాన్‌ మస్క్‌ లాంటివాళ్లు ముందుకురావాలి’

దుర్భిక్ష ప్రాంతవాసుల ఆకలి సమస్య తీర్చేందుకు బిలియనీర్లు వన్ టైం ప్రాతిపదికన ముందుకు రావాల్సిన అవసరం ఉందని ఐరాస వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్(డబ్ల్యూఎఫ్‌పీ) డైరెక్టర్ డేవిడ్ బీస్లీ ఆకాంక్షించారు. తాజాగా ఓ వార్తాసంస్థ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ఆకలిపై పోరాటానికి...

Published : 28 Oct 2021 22:47 IST

న్యూయార్క్‌: దుర్భిక్ష పరిస్థితుల్లో జీవనం వెళ్లదీస్తున్నవారి ఆకలి బాధలను తీర్చేందుకు బిలియనీర్లు వన్ టైం ప్రాతిపదికన ముందుకు రావాల్సిన అవసరం ఉందని ఐరాస వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్(డబ్ల్యూఎఫ్‌పీ) డైరెక్టర్ డేవిడ్ బీస్లీ పిలుపునిచ్చారు. తాజాగా ఓ వార్తాసంస్థ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ఆకలిపై పోరాటానికి సంపన్నవర్గాల తోడ్పాటు అవసరమని పేర్కొన్నారు. ప్రత్యేకంగా అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్‌ల పేర్లను ప్రస్తావిస్తూ.. వారు తమ సంపదలో స్వల్ప మొత్తాన్ని ఇవ్వడం ద్వారా సమస్య పరిష్కారానికి పాటుపడినవారవుతారని చెప్పారు. వాతావరణ మార్పులు, కొవిడ్‌ మహమ్మారి తదితర సంక్షోభాల కారణంగా చాలా దేశాలు కరవు ముంగిట ఉన్నాయని డబ్ల్యూఎఫ్‌పీ డైరెక్టర్‌ వివరించారు.

6 బిలియన్‌ డాలర్లు కావాలి..

అఫ్గాన్‌ వంటి దేశాలు తీవ్రమైన ఆకలి, నిరుద్యోగం, ఆర్థిక మందగమనం కారణంగా సంక్షోభ పరిస్థితుల్లో ఉన్నాయని.. గ్వాటెమాల, హోండురాస్, నికరాగ్వా తదితర దేశాలు తుపానులు, ఆకస్మిక వరదలతో అతలాకుతలమయ్యాయని బీస్లీ చెప్పారు. తక్షణమే ఆదుకోని పక్షంలో దాదాపు 4.20 కోట్ల మంది చనిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వారికి సహాయం చేసేందుకు 6 బిలియన్‌ డాలర్లు అవసరమవుతాయని చెప్పారు. మస్క్ నికర సంపదలో ఇది స్వల్ప మొత్తమేనని ఆయన పేర్కొన్నారు. ఆయా నివేదికల ప్రకారం.. మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి అమెరికా బిలియనీర్ల నికర ఆదాయం పెరుగుతూ వచ్చింది! ఇటీవల ఒక్కరోజే మస్క్‌ ఏకంగా రూ.2.71 లక్షల కోట్లు సంపాదించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని