Corbevax: 12-18 ఏళ్ల పిల్లలకు టీకా: అనుమతి కోసం బయోలాజికల్‌ ఇ-దరఖాస్తు

12 నుంచి 18 ఏళ్ల వయసున్న పిల్లలకు అందించేందుకు ‘కార్బెవాక్స్‌ (Corbevax)’ పేరుతో కరోనా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన బయోలాజికల్‌ ఇ సంస్థ.. అత్యవసర వినియోగ అనుమతి కోరుతూ భారత ఔషధ నియంత్రణకు దరఖాస్తు చేసుకుంది.

Updated : 14 Feb 2022 04:24 IST

దిల్లీ: 12 నుంచి 18 ఏళ్ల వయసున్న పిల్లలకు అందించేందుకు ‘కార్బెవాక్స్‌ (Corbevax)’ పేరుతో కరోనా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన బయోలాజికల్‌ ఇ సంస్థ.. అత్యవసర వినియోగ అనుమతి కోరుతూ భారత ఔషధ నియంత్రణకు దరఖాస్తు చేసుకుంది. తుదిదశ ప్రయోగాల ఫలితాలను విశ్లేషించిన అనంతరం వినియోగ అనుమతి కోరినట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఇక పెద్దవాళ్లకు వినియోగించేందుకు డిసెంబర్‌ 28నే ఈ వ్యాక్సిన్‌ వినియోగానికి డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (DCGI) అనుమతి పొందగా తాజాగా 12 ఏళ్ల వయసున్న వారికి టీకా అనుమతి కోరింది.

5 నుంచి 18ఏళ్ల చిన్నారులకు వినియోగించేందుకు గానూ కార్బెవాక్స్‌ వ్యాక్సిన్‌ తుదిదశ ప్రయోగాలు చేసేందుకు గత సెప్టెంబర్‌ నెలలో బయోలాజికల్‌ ఇ అనుమతి పొందినట్లు ఆ సంస్థ ప్రతినిధి శ్రీనివాస కొసరాజు పేర్కొన్నారు. వీటికి సంబంధించి వ్యాక్సిన్‌ సురక్షిత, రోగనిరోధకత ఫలితాలను విశ్లేషించగా మెరుగైన ఫలితాలు కనిపించినట్లు వెల్లడించారు. మధ్యంతర ఫలితాలను విశ్లేషించిన అనంతరం 12 నుంచి 18 ఏళ్ల వయసు వారికి టీకా అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ డీసీజీఐకి దరఖాస్తు చేసుకున్నామన్నారు.

హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్‌ - ఇ అభివృద్ధి చేసిన కార్బివాక్స్‌ టీకా 5 కోట్ల డోసుల కోసం ఆ సంస్థకు ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఆర్డర్‌ ఇచ్చింది. ఒక్కో డోసును రూ. 145 (జీఎస్‌టీ అదనం) చొప్పున వీటిని కొనుగోలు చేయనున్నట్లు సమాచారం. అయితే, ఈ టీకాను ఎవరికి అందిస్తారన్న దానిపై స్పష్టతలేనప్పటికీ ప్రికాషినరీ డోసుగా ఇచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ప్రికాషనరీ డోసు పేరుతో మూడో డోసును ప్రభుత్వం ఇప్పటికే అందిస్తోంది. ఇదే సమయంలో రానున్న రోజుల్లో 60ఏళ్లలోపు వారికి మూడో డోసుగా దీనినే పంపిణీ చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. ఇదిలాఉంటే, రెండు డోసుల్లో తీసుకునే కార్బెవ్యాక్స్‌ వ్యాక్సిన్‌ను 28 రోజుల వ్యవధిలో తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని 2 నుంచి 8 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతల వద్ద నిల్వ చేయాల్సి ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని