Birbhum Killings: సజీవ దహనానికి ముందు వారిని తీవ్రంగా కొట్టారు..!

పశ్చిమ బెంగాల్‌లోని బీర్‌భూం జిల్లాలో చోటుచేసుకున్న సజీవ దహనాల ఘటన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు, ఇద్దరు

Published : 24 Mar 2022 13:14 IST

బీర్‌భూం ఘటనలో వెలుగులోకి కీలక విషయం

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని బీర్‌భూం జిల్లాలో చోటుచేసుకున్న సజీవ దహనాల ఘటన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులు సహా 8 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే, ఇళ్లకు నిప్పంటించే ముందు వారిని తీవ్రంగా కొట్టినట్లు తాజాగా పోస్ట్‌మార్టం నివేదికలో తేలింది. 

రామ్‌పుర్‌హాట్‌ పట్టణ శివారులోని బోగ్‌టూయి గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున ఎనిమిది ఇళ్లు అగ్నికి ఆహుతై 8 మంది సజీవ దహనమైన విషయం తెలిసిందే. మృతదేహాలకు రామ్‌పుర్‌హాట్‌ ఆసుపత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించారు. వీరి శరీరాలపై తీవ్ర గాయాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. సజీవ దహానికి ముందు వీరిని అత్యంత తీవ్రంగా కొట్టినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. 

గత సోమవారం తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన బర్షాల్‌ గ్రామ పంచాయతీ ఉప ప్రధాన్‌ భాదు షేక్‌ హత్య జరిగింది. ఈ ఘటన జరిగిన కొద్దిగంటలకే బోగ్‌టూయి గ్రామంలో హింస చెలరేగింది. భాదు షేక్‌ హత్యకు ప్రతీకారంగానే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి ఇప్పటివరకు 22 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

మరోవైపు ఈ కేసును సుమోటోగా స్వీకరించిన కోల్‌కతా హైకోర్టు నిన్న  విచారణ చేపట్టింది. తక్షణం బోగ్‌టూయి గ్రామాన్ని సందర్శించి ఫోరెన్సిక్‌ పరీక్షకు అవసరమైన నమూనాలు సేకరించాలంటూ దిల్లీలోని సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేబొరేటరీని ఆదేశించింది. ఇళ్లు కాలినచోట జిల్లా జడ్జి సమక్షంలో సీసీ టీవీలు అమర్చి రికార్డింగు కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో అధికారులు ఆ ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలను అమర్చారు. నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బోగ్‌టూయి గ్రామానికి వెళ్లి బాధితులను పరామర్శించనున్నారు. ఈ ఘటనకు బాధ్యులెవరైనా.. వారిని కఠినంగా శిక్షిస్తామని దీదీ స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని