తొమ్మిది రాష్ట్రాలకు పాకిన బర్డ్‌ఫ్లూ

బర్డ్‌ఫ్లూ (ఏవియన్‌ ఇన్‌ఫ్లుయెంజా) బాధిత రాష్ట్రాల్లో తాజాగా మహారాష్ట్ర కూడా చేరిపోయింది. దీంతో దేశంలో ఈ వ్యాధి సంక్రమించిన రాష్ట్రాల అంకె ఎనిమిదికి  చేరింది. దిల్లీ, ఛత్తీస్‌గఢ్ నుంచి ఇంకా సమాచారం రావాల్సి ఉంది.........

Updated : 11 Jan 2021 10:24 IST

దిల్లీ: బర్డ్‌ఫ్లూ (ఏవియన్‌ ఇన్‌ఫ్లుయెంజా) బాధిత రాష్ట్రాల్లో తాజాగా మహారాష్ట్ర, దిల్లీ కూడా చేరాయి. దీంతో దేశంలో ఈ వ్యాధి సంక్రమించిన రాష్ట్రాల అంకె తొమ్మిదికి  చేరింది. ఛత్తీస్‌గఢ్ నుంచి ఇంకా సమాచారం రావాల్సి ఉంది. గత రెండు రోజుల్లో మహారాష్ట్రలో 800 కోళ్లు మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. పర్బాణీ ఈ వ్యాధికి కేంద్రంగా ఉన్నట్లు గుర్తించారు. చనిపోయిన కోళ్ల నమూనాలను పరీక్షలకు పంపగా.. అది బర్డ్‌ఫ్లూనే అని నిర్ధారణ అయ్యింది. మురుంబా గ్రామంలో ఉన్న 8 కోళ్ల ఫారాలలో 8000 పక్షులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ గ్రామంలోనే వ్యాధి ఆనవాళ్లు కనిపించడంతో వాటన్నింటినీ.. పూడ్చిపెట్టాలని ప్రభుత్వ యంత్రాంగం ఆదేశించింది. దిల్లీలోని సంజయ్‌ కొలనులో పక్షులు అసాధారణ స్థాయిలో మృత్యువాత పడడానికి కారణమూ బర్డ్‌ఫ్లూనే అని తేలింది.

కేరళ, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, హరియాణా, గుజరాత్‌ రాష్ట్రాలు ఇప్పటికే బర్డ్‌ఫ్లూతో వణికిపోతున్న విషయం తెలిసిందే. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బాలోద్‌ జిల్లాలోనూ పక్షుల మృత్యువాతపడుతున్నాయి. వీటి నివేదికలు ఇంకా రావాల్సి ఉంది. ఈ వ్యాధి మరింత విస్తరించకుండా తగు నివారణ చర్యలు చేపట్టాల్సిందిగా కేంద్రం ఆయా రాష్ట్రాలకు సూచనలు జారీ చేసింది. నీటికుంటలు, పక్షుల మార్కెట్లు, జంతు ప్రదర్శనశాలలపై నిఘా పెట్టాలని సూచించింది. ఎటువంటి అపోహలు ప్రచారం చేయకుండా, ప్రజలకు కచ్చితమైన సమాచారం చేరేలా అధికార యంత్రాంగం చూడాలని కోరింది.

ఈ నేపథ్యంలో నేడు పార్లమెంటరీ స్థాయి సంఘం(వ్యవసాయం) అత్యవసరంగా భేటీ కానుంది. అలాగే తగు వ్యాక్సిన్లు అందుబాటులో ఉంచాలని కేంద్ర పశుసంవర్ధక శాఖ అధికారులను ఆదేశించింది. మరోవైపు పక్షుల్లో గుర్తించిన హెచ్‌1ఎన్‌8 వైరస్‌ పక్షుల నుంచి మనుషులకు సోకే అవకాశం ప్రస్తుతానికి చాలా తక్కువగానే ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఇవీ చదవండి..

బర్డ్‌ ఫ్లూ: గుడ్డు..మాంసం తినొచ్చా?

జూలపై నిత్య పర్యవేక్షణ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని