Updated : 28 Jan 2021 01:50 IST

జాతీయ జెండాను అవమానిస్తే దేశం సహించదు 

దిల్లీ: జాతీయ పతాకాన్ని అవమానించే చర్యల్ని దేశం ఎప్పటికీ ఉపేక్షించదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. గణతంత్ర దినోత్సవం రోజున రైతుల ర్యాలీ హింసాత్మకంగా మారడాన్ని కేంద్రం తీవ్రంగా ఖండించింది. దేశ రాజధానిలో చోటుచేసుకున్న ఆ హింసాత్మక చర్యలకు బాధ్యులైన వారిని ఊరికే వదిలిపెట్టబోమని హెచ్చరించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘హింస జరగడానికి ఇతరుల్ని ప్రేరేపించిన ప్రతి ఒక్కరిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఎర్రకోట వద్ద జాతీయ పతాకాన్ని అవమానించేలా చేసిన ఏ చర్యల్ని భారత్‌ ఉపేక్షించదు’ అని జావడేకర్‌ పేర్కొన్నారు. 

ఈ సందర్భంగా జావడేకర్‌ కాంగ్రెస్‌ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ హింసాత్మక ఘటనల వెనక కాంగ్రెస్‌ పార్టీ కుట్ర ఉందని జావడేకర్‌ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ దిల్లీలో జరుగుతున్న రైతుల ఆందోళనలను ఎల్లప్పుడూ రెచ్చగొట్టడానికే పనిచేసిందని ఆరోపించారు. ఈ ర్యాలీ ఘటనపై అభినందిస్తూ కొందరు కాంగ్రెస్‌ నాయకులు చేసిన ట్వీట్లను జావడేకర్‌ ఈ సందర్భంగా ప్రస్తావించారు. 

దేశంలో ప్రధాని నరేంద్ర మోదీకి జనాధరణ పెరగడం తట్టుకోలేని ప్రతిపక్షాలు దేశం ప్రశాంతంగా లేకుండా.. హింస జరగాలని కాంక్షిస్తున్నాయని విమర్శించారు. కుటుంబ రాజకీయాల కోసం కొన్ని పార్టీలు చేస్తున్న పనులు ఆందోళన కలగజేస్తున్నాయని తెలిపారు. కేంద్రం, రైతు సంఘాల మధ్య చర్చలు పరిష్కారం కాకూడదనే కాంగ్రెస్‌ కోరుకుంటోందని విమర్శించారు. ఆందోళనకారులు కత్తులు, రాళ్లతో దాడులకు పాల్పడినప్పటికీ.. ఎంతో సంయమనంతో విధి నిర్వర్తించిన దిల్లీ పోలీసులను ఆయన ప్రశంసించారు. 

కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గణతంత్ర దినోత్సవం రోజున రైతులు చేపట్టిన ట్రాక్టర్‌ ర్యాలీ ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే.  రైతులు ఎర్రకోటపై  రైతు జెండాలను ఎగురవేశారు. ఈ ఘటనలో 300 మంది పోలీసులకు గాయాలైనట్లు దిల్లీ పోలీసు శాఖ వెల్లడించింది. ఘటనకు బాధ్యులుగా అనుమానిస్తున్న 200 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 22 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు తెలిపారు. 

ఇదీ చదవండి

సాగు చట్టాలను నిరసిస్తూ ఎమ్మెల్యే రాజీనామా

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని