పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన!

శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పుదుచ్చేరిలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలో రాష్ట్రపతి పాలన విధించాలని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కేంద్రానికి సిఫారసు చేశారు.

Updated : 24 Feb 2021 14:10 IST

పుదుచ్చేరి: పుదుచ్చేరిలో నెలకొన్న రాజకీయ సంక్షోభం.. తాజాగా రాష్ట్రపతి పాలన దిశగా సాగుతోంది. పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలో రాష్ట్రపతి పాలన విధించాలని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కేంద్రానికి సిఫారసు చేశారు. గవర్నర్‌ పంపిన లేఖను కేంద్ర కేబినెట్‌ నేడు ఆమోదిస్తూ.. నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

రెండ్రోజుల క్రితం శాసనసభలో నిర్వహించిన విశ్వాస పరీక్షలో అధికార కాంగ్రెస్‌ బల నిరూపణ చేసుకోకపోవడంతో ప్రభుత్వం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భాజపా, దాని కూటమి పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలోనే అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. గురువారం పుదుచ్చేరిలో ప్రధాని మోదీ పర్యటించనున్న నేపథ్యంలో ఈ పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం.

ఇటీవల పుదుచ్చేరిలో అధికార కాంగ్రెస్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శాసనసభలో కాంగ్రెస్‌ బలం తగ్గింది. దీంతో అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నిర్వహించగా నారాయణ స్వామి ప్రభుత్వం అందులో నెగ్గలేకపోయింది. ఓటింగ్‌కు ముందుగానే సీఎం, మంత్రులు రాజీనామా పత్రాలను గవర్నర్‌కు సమర్పించి వాకౌట్‌ చేయడంతో.. విశ్వాస పరీక్షలో అధికార పార్టీ విఫలమైనట్లు స్పీకర్‌ శివకొళుందు ప్రకటించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని