NEET: నీట్‌ పేపర్ లీక్‌ వెనక తేజస్వి సహాయకుడు: భాజపా సంచలన ఆరోపణలు

నీట్‌ కుంభకోణంలో బిహార్‌ అధికార, విపక్ష పార్టీలు ఒకదానిపై ఒకటి ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్ హస్తం ఉందని భాజపా సంచలన వ్యాఖ్యలు చేసింది.

Published : 20 Jun 2024 15:11 IST

దిల్లీ: ‘నీట్‌- యూజీ ప్రవేశపరీక్ష 2024 (NEET UG-2024)’లో జరిగిన అవకతవకలు, పేపర్‌లీక్‌ వెనక ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్ సహాయకుడి ప్రమేయం ఉందని బిహార్‌ డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హా ఆరోపించారు. ఈమేరకు మీడియాతో మాట్లాడారు.

నీట్ కుంభకోణం దర్యాప్తు నిమిత్తం బిహార్‌ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటుచేయగా.. ఇప్పటివరకు 14 మంది అరెస్టయ్యారు. వారిలో ఒక జూనియర్ ఇంజినీర్ కూడా ఉన్నారు. తేజస్వి సహాయకుడు బిహార్‌ రోడ్ కన్‌స్టక్షన్ డిపార్ట్‌మెంట్‌(RCD)కు చెందిన ఉద్యోగికి ఫోన్‌ చేసి.. ఆ ఇంజినీర్‌ కోసం ఒక గది బుక్‌ చేయించినట్టు సిన్హా ఆరోపించారు. పరీక్ష జరగడానికి నాలుగురోజుల ముందు ఈ కాల్ వెళ్లినట్లు చెప్పారు. దీనిపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వారికి అధికారం లేకపోయినా.. లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకోవాలనుకుంటున్నారని విమర్శించారు. పట్నాలోని ఎన్‌హెచ్‌ఏఐ(National Highways Authority of India) గెస్ట్‌హౌస్‌లో ఆ రూమ్‌ బుక్‌ చేసిన ఆర్‌సీడీ ఉద్యోగితో పాటు మరో ఇద్దరిని సస్పెండ్ చేసినట్లు సిన్హా చెప్పారు.

దీనిపై బిహార్‌ ఎన్‌హెచ్‌ఏఐ స్పందించింది. తమకు పట్నాలో అసలు గెస్ట్‌హౌస్ సౌకర్యమే లేదని చెప్పింది. మరోవైపు ఆర్జేడీ అదేతరహా ఆరోపణలు చేసింది. ఇతర నిందితులతో భాజపా, జేడీయూకు సంబంధాలు ఉన్నాయని వెల్లడించింది. 

విపక్షాల ఆగ్రహం.. 

అటు నీట్‌ పేపర్ లీక్‌ ఘటన కలకలం సృష్టిస్తుంటే.. ఇటు జాతీయ పరీక్ష సంస్థ (ఎన్‌టీఏ) మంగళవారం దేశవ్యాప్తంగా నిర్వహించిన యూజీసీ-నెట్‌ జూన్‌-2024 పరీక్షను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. వీటిపై విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి కీలక పరీక్షల్లో పదేపదే అవకతవకలు చోటుచేసుకోవడంపై విపక్ష ఇండియా కూటమి నేతలు ఎక్స్‌ (ట్విటర్) వేదికగా ఆందోళన వ్యక్తంచేశారు. కొందరైతే ఈ పరిస్థితులను ఎడ్యుకేషన్ ఎమర్జెన్సీ అని వ్యాఖ్యానించారు.

‘‘మీరు పరీక్షల గురించి చాలా మాట్లాడతారు. మరి నీట్ పరీక్ష గురించి ఎప్పుడు మాట్లాడతారు. యూజీసీ-నెట్ రద్దు లక్షలాది మంది ప్రజల విజయం. ఇది మోదీ ప్రభుత్వ దురహంకారానికి పరాజయం. నీట్‌ పేపర్ లీక్‌ కాలేదని ఇటీవల విద్యాశాఖ మంత్రి చెప్పారు. కానీ బిహార్‌, గుజరాత్‌, హరియాణాలో కొన్ని అరెస్టులు చోటుచేసుకున్న తర్వాత.. ఏదో జరిగిందని అంగీకరించారు. ఇక నీట్ పరీక్ష ఎప్పుడు రద్దు చేస్తారు..?’’ అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శలు చేశారు. ప్రభుత్వ అవినీతి, నిర్లక్ష్యం యువత భవిష్యత్తుకు ప్రమాదకరంగా పరిణమించాయని కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంకాగాంధీ దుయ్యబట్టారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని