Mumbai: ముంబయిని కేంద్రపాలిత ప్రాంతంగా చేసేందుకు కుట్రలు.. ఆధారాలున్నాయన్న రౌత్‌!

మహారాష్ట్ర రాజధాని ముంబయిని కేంద్ర పాలిత ప్రాంతంగా చేసేందుకు భాజపా కుట్రలు పన్నుతోందని శివసేన నేత, ఎంపీ సంజయ్‌ రౌత్‌ ఆరోపించారు. ఇందుకు సంబంధించిన

Published : 09 Apr 2022 01:48 IST

ముంబయి: మహారాష్ట్ర రాజధాని ముంబయిని కేంద్ర పాలిత ప్రాంతంగా చేసేందుకు భాజపా కుట్రలు పన్నుతోందని శివసేన నేత, ఎంపీ సంజయ్‌ రౌత్‌ ఆరోపించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు తనవద్ద ఉన్నాయన్నారు. ఈ విషయమై ఇప్పటికే కొందరు భాజపా నేతలు కేంద్ర హోంశాఖకు ప్రజెంటేషన్‌ ఇచ్చారన్నారు.

‘‘ముంబయిని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చేందుకు భాజపా ప్రణాళికలు చేస్తోంది. ఎంపీ కిరిట్‌ సోమయాతో పాటు పార్టీ నేతలు, వ్యాపారవేత్తలు ఈ కుట్రలో భాగంగా ఉన్నారు. ఇప్పటికే ఈ బృందం కేంద్ర హోంశాఖకు దీనిపై ప్రజెంటేషన్‌ ఇచ్చింది. గత రెండు నెలలుగా దీనికి సంబంధించి సమావేశాలు, నిధుల సేకరణ కూడా జరుగుతోంది. నేనేం ఆరోపణలు చేయడం లేదు. నా వద్ద పూర్తి సాక్ష్యాధారాలున్నాయి. ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేకు కూడా ఈ విషయం తెలుసు’’ అని సంజయ్‌ రౌత్‌ మీడియాతో అన్నారు.

రానున్న కొన్ని నెలల్లో కిరిట్‌ నేతృత్వంలోని ఈ బృందం కోర్టును ఆశ్రయించే అవకాశాలున్నాయని రౌత్‌ అన్నారు. ముంబయిలో మరాఠీ ప్రజల సంఖ్య నానాటికీ తగ్గుతున్న నేపథ్యంలో ఈ నగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని ఆ బృందం కోరే అవకాశాలున్నాయని ఆరోపించారు. గతంలో ముంబయి పాఠశాలల్లో మరాఠీ భాష తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కిరిట్‌ సవాల్‌ చేసిన విషయాన్ని రౌత్‌ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని