Hemant Soren: భాజపాపై విరుచుకుపడ్డ హేమంత్‌ సోరెన్‌

ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో భాజపాకు ప్రజలు గుణపాఠం నేర్పారని ఝార్ఖండ్‌ మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌ పేర్కొన్నారు.

Published : 29 Jun 2024 20:22 IST

రాంచీ: తనను జైలులో నిర్బంధించేందుకు కుట్రపన్నిందంటూ భాజపా (BJP)పై ఝార్ఖండ్‌ మాజీ సీఎం, జేఎఎం కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్‌ సోరెన్‌ (Hemant Soren) విరుచుకుపడ్డారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో కాషాయ పార్టీ తుడిచిపెట్టుకుపోతుందన్నారు. రాంచీలోని తన నివాసం వద్ద జేఎంఎం శ్రేణులనుద్దేశించి ప్రసంగించారు.

‘‘దేశ సామాజిక వ్యవస్థను నాశనం చేయడంలో భాజపా ఆరితేరింది. రాజ్యాంగబద్ధ వ్యవస్థలను నియంత్రించింది. లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీకి గుణపాఠం చెప్పారు. ఝార్ఖండ్‌లో భాజపాకు ముగింపు పలికే సమయం ఆసన్నమైంది. రాష్ట్రం నుంచి ఆ పార్టీ కనుమరుగవుతుంది’’ అని హేమంత్‌ వ్యాఖ్యానించారు.

‘హేమంత్‌ సోరెన్‌ దోషి అని నమ్మడానికి ఆధారాల్లేవు’

భూకుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో ఐదు నెలలుగా జైలులో ఉన్న హేమంత్‌కు ఝార్ఖండ్‌ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే. కేసు వివరాలను చూస్తే సోరెన్‌ దోషి అని నమ్మడానికి కారణాలు కనిపించడం లేదని పేర్కొంది. ఈ క్రమంలోనే శుక్రవారం ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. కేసులో తనను అక్రమంగా ఇరికించారని, ఐదు నెలలు కటకటాల వెనుక గడపాల్సిన పరిస్థితులు సృష్టించారని జైలు నుంచి విడుదలైన అనంతరం ఆవేదన వ్యక్తంచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని